Share News

పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు

ABN , Publish Date - May 04 , 2024 | 03:14 AM

మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదైంది.

పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు

మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేర్ని నాని తనయుడు

మరో ఐదుగురిపైనా ఇదే సెక్షన్‌ నమోదు

కిట్టును తప్పించి మిగిలిన వారి అరెస్టు

హత్యాయత్నం సెక్షన్‌ను తిరస్కరించిన జడ్జి

నిందితులకు బెయిల్‌ మంజూరు

మచిలీపట్నం, మే 3(ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదైంది. మరో ఐదుగురు వైసీపీ కార్యకర్తలపైనా పోలీసులు ఇదే కేసు నమోదుచేశారు. మచిలీపట్నంలో జనసేన కార్యకర్త కర్రి మహేశ్‌ కుటుంబసభ్యులపై దాడిచేసి, ఆ ఇంట్లోని మహిళ పుస్తెలతాడు లాగేసి, కొట్టిన ఘటనలో పోలీసులు శుక్రవారం కేసు నమోదుచేశారు. ఘటన జరిగిన సమయంలో ప్రచార వాహనంలో ఉండి వైసీపీ కార్యకర్తలు దాడిచేసేలా ప్రోత్సహించారన్న బాధితుల ఫిర్యాదుపై పేర్ని కిట్టును ఈ కేసులో ఏ-1గా పేర్కొన్నారు. దాడి ఘటనలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు చిలకలపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్‌, శీనయ్య, ధనబాబు, లంకే రమేశ్‌ను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదుచేశారు. ఈ కేసులో పేర్ని కిట్టు మినహా మిగిలిన ఐదుగురిని అరెస్ట్‌ చేసి మచిలీపట్నం 2వ అదనపు మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. ఇరువర్గాలు ఘర్షణ పడుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు కర్రి మహేశ్‌, మరో ముగ్గురు తనను కులం పేరుతో దూషించారని వైసీపీకి చెందిన నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. అయితే, నిందితులపై పెట్టిన హత్యాయత్నం సెక్షన్‌ను 2వ అదనపు మెజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి తిరస్కరించారు. అనంతరం నిందితులకు బెయిల్‌ మంజూరు చేశారు. వైసీపీ కార్యకర్తలను కోర్టులో హాజరుపరిచే సమయంలో పేర్ని నాని కోర్టు వద్దకు వచ్చారు.

జనసేనలో చురుగ్గా ఉన్నారనే!

మచిలీపట్నం కార్పొరేషన్‌ పరిధిలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో జనసేన కార్యకర్త కర్రి మహేశ్‌ నివసిస్తున్నారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన తరఫున కార్పొరేటర్‌గా పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం బ్యాంకు అప్రయిజర్‌గా పనిచేస్తూ జనసేనలో చురుగ్గా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు గురువారం 8వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో కర్రి మహేశ్‌ నివాసం వద్ద వైసీపీ కార్యకర్తలు బాణాసంచా కాలుస్తుండగా నిప్పురవ్వలు ఇంట్లో పడ్డాయి. తమ నివాసం ఎదుట బాణాసంచా కాల్చవద్దని మహేశ్‌ భార్య హేమలత, కుమారుడు సాయికృష్ణ రామబ్రహ్మం, తల్లి జ్ఞానప్రసూనాంబ, ఇతర కుటుంబ సభ్యులు గోకుల్‌, నాగబాబు వైసీపీ కార్యకర్తలను కోరారు. దీంతో రెచ్చిపోయిన కిట్టు అనుచరులు ‘మాకే అడ్డుచెబుతారా’ అంటూ వారిపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా దాడి చేసి మెడలోని హేమలత మెడలోని మంగళసూత్రాలు లాగేశారు. వస్తువులను ధ్వంసం చేశారు. గొడవ జరుగుతున్న సమయంలో అక్కడకు చేరుకున్న మహేశ్‌పైనా దాడిచేశారు. దాడి ఘటనపై సత్వరం స్పందించాల్సిన పోలీసులు జాప్యం చేయడంతో పోలీసు స్టేషన్‌ వద్ద బాధితులపై కిట్టు అనుచరులు మరోసారి పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడ్డారు. పోలీసుల తీరుపై మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ జనసేనపార్టీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గురువారం ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. దీంతో పోలీసులు స్పందించారు. శుక్రవారం హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చారు.

Updated Date - May 04 , 2024 | 03:14 AM