Share News

కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌పై కేసు నమోదు

ABN , Publish Date - May 30 , 2024 | 02:02 AM

అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం ఉల్లంఘన అభియోగాలపై విశాఖ వన్‌టౌన్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌పై కేసు నమోదుచేశారు.

కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌పై కేసు నమోదు

అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అభియోగం

నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌

విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి): అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం ఉల్లంఘన అభియోగాలపై విశాఖ వన్‌టౌన్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌పై కేసు నమోదుచేశారు. తనపై పలుమార్లు అశోక్‌కుమార్‌ అత్యాచారం చేయడంతోపాటు లైంగికంగా వేధిస్తున్నారంటూ కొద్దిరోజుల కిందట క్రమశిక్షణ చర్యలకు గురైన గ్రేడ్‌-1 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఒకరు సోమవారం సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సీపీ ఆదేశాల మేరకు హార్బర్‌ ఏసీపీ మోసేజ్‌ పాల్‌ ఆధ్వర్యంలో వన్‌టౌన్‌ పోలీసులు మంగళవారం ఇరువర్గాలను ప్రాథమికంగా విచారించి సీపీకి నివేదిక సమర్పించారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం అర్ధరాత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌పై కేసు నమోదుచేశారు. దర్యాప్తు బాధ్యతలను హార్బర్‌ ఏసీపీ మోసేజ్‌ పాల్‌కు అప్పగించారు. బాధితురాలి కుల ధ్రువీకరణ కోసం ఆయన ఇప్పటికే రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. అలాగే బాధితురాలికి వైద్య పరీక్షలు, అభియోగాలు ఎదుర్కొంటున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌కు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించాల్సి ఉండడంతో దీనికోసం ఏర్పాట్లు చేయాలంటూ కేజీహెచ్‌ అధికారులకు లేఖ రాశారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం తన వద్దకు విచారణకు హాజరుకావాలంటూ ఇరువర్గాలకు సమాచారం అందజేశారు. ఇరువర్గాలను విచారించే సమయంలో వీడియో రికార్డింగ్‌ చేయనున్నారు. ఇదిలావుండగా కేజీహెచ్‌లో ఇరువర్గాల మధ్య తలెత్తిన వ్యక్తిగత విభేదాలే వివాదానికి కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలిసింది.

Updated Date - May 30 , 2024 | 07:56 AM