Share News

ఇంట్లో పట్టుబడిన ఎలుగుబంటి

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:27 AM

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరులోని ఓ పాడుపడిన ఇంట్లో దూరిన ఎలుగుబంటిని జూ అధికారులు చాకచక్యంగా పట్టుకుని బోనులో బంధించారు.

ఇంట్లో పట్టుబడిన ఎలుగుబంటి

వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 2: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరులోని ఓ పాడుపడిన ఇంట్లో దూరిన ఎలుగుబంటిని జూ అధికారులు చాకచక్యంగా పట్టుకుని బోనులో బంధించారు. మెట్టూరులో సోమవారం అర్ధరాత్రి పాడుపడిన ఇంట్లోకి ఎలుగుబంటి ప్రవేశించింది. ఆ సమయంలో కుక్కలు బిగ్గరగా అరవడంతో స్థానికులు కొమర దమయంతి, గండుపల్లి మోహన్‌ చూడగా ఎలుగుబంటి కనిపించింది. వేకువజామున 5 గంటలకు స్థానికులు అటవీ శాఖాధికారుల కు సమాచారం అందజేశారు. అటవీశాఖా అధికారి నిషాకుమారి ఆధ్వర్యంలో సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎలుగుబంటిని బయటకు పంపించే ప్రయత్నాలు చేశారు. ఇంటిచుట్టూ వలలు, ఇనుప ఊచలు అడ్డంగా ఉంచారు. ఎలుగుబంటిని పట్టుకోవాలనే ఉద్దేశంతో విశాఖపట్నం జూ అధికారులకు సమాచారం అందజేశారు. మంగళవారం మధ్యాహ్నం రిస్క్యూటీం చేరుకొంది. మత్తుమందు లేకుండా ఎలాగైనా ఎలుగుబంటిని బంధించాలనే ఉద్దేశంతో బోనును ఇంటిముందు ఉంచారు. పెద్దపెద్ద శబ్దాలు చేయడంతో ఇంటిలోపల నుంచి ఎలుగుబంటి బయటకు రాగా బోనులో బంధించారు. ఆ ఎలుగుబంటిని విశాఖ జూ కు తరలించినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 03:27 AM