Share News

తొమ్మిది నెలల్లో 73,450 కోట్ల అప్పు

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:14 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9నెలల్లో జగన్‌ సర్కారు అధికారికంగా రూ.73,450 కోట్ల అప్పులు తెచ్చింది.

తొమ్మిది నెలల్లో 73,450 కోట్ల అప్పు

ఆర్బీఐ నుంచి కొత్తగా రూ.3,000 కోట్ల రుణం

అప్పులపై కట్టే వడ్డీలే నెలకు రూ.2,300 కోట్లు

అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9నెలల్లో జగన్‌ సర్కారు అధికారికంగా రూ.73,450 కోట్ల అప్పులు తెచ్చింది. ఇందులో కేంద్రం అనుమతితో ఆర్‌బీఐ నుంచి తెచ్చిన రుణాలు రూ.58,450 కోట్లు. ఇవికాకుండా నాబార్డు, ఈఏపీ లోన్లు, ఎంప్లాయీ కటింగ్స్‌ కేంద్రం ఇచ్చే అప్పులు అన్నీ కలిపి దాదాపు రూ.15వేల కోట్ల వరకూ వాడుకుంది. దీంతో 2023 ఏప్రిల్‌ నుంచి 2024 జనవరి 2 వరకు ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.73,450 కోట్లకు చేరింది. ఇక కేంద్రం అనుమతి లేకుండా, రాజ్యాంగాన్ని, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘిస్తూ కార్పొరేషన్ల నుంచి రూ.వేల కోట్ల అప్పులు తెచ్చారు. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.60,450 కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతిచ్చింది. ఇందులో మొదటి తొమ్మిది నెలల్లో రూ.58,450 కోట్లు వాడేశారు. ఇంకా రూ.2వేల కోట్ల అప్పులకు మాత్రమే పరిమితి మిగిలింది. తాజాగా మంగళవారం ఆర్‌బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూ.3,000 కోట్ల అప్పు తెచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ప్రభుత్వం కేవలం అప్పులపై వడ్డీలే సగటున నెలకు రూ.2,300 కోట్లు చొప్పున రూ.20,700 కోట్ల వరకు చెల్లించింది. ఇంత భారీగా వడ్డీలు చెల్లిస్తూ తెస్తున్న అప్పుల్లో కనీసం 10శాతం కూడా ప్రభుత్వం మూలధన వ్యయం కోసం ఖర్చు చేయడం లేదు.

Updated Date - Jan 03 , 2024 | 07:35 AM