Share News

వర్సిటీల ఉద్యోగులకూ 62 ఏళ్లు

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:04 AM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ యూనివర్సిటీల్లోని బోధనేతర సిబ్బందిని ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

వర్సిటీల ఉద్యోగులకూ 62 ఏళ్లు

బోధనేతర సిబ్బందికీ వర్తింపు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర్వులు

ఇప్పటి నుంచే అమల్లోకి .. ఇటీవలే రిటైరైన 300 మందికి నష్టం

అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సమీపిస్తున్న వేళ యూనివర్సిటీల్లోని బోధనేతర సిబ్బందిని ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వారి పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఉన్నత విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు జారీఅయిన రోజు నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనివల్ల సుమారు 11,500 మంది ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెరుగుతుంది. దాదాపు మూడేళ్లుగా తమకూ రిటైర్మెంట్‌ వయసును 62 ఏళ్లు చేయాలని ఉన్నత విద్యాశాఖ పరిధిలోని బోధనేతర ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతూ వస్తున్నారు. గతంలో 62 ఏళ్లు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేదు. ఈలోపు వర్సిటీల్లోని బోధనా సిబ్బంది పదవీవిరమణ వయసును 65 ఏళ్లకు పెంచారు. కానీ బోధనేతర సిబ్బందిని మాత్రం పట్టించుకోలేదు. ఈలోగా అనేక మంది ఉద్యోగులు 60 ఏళ్లు నిండటంతో రిటైర్‌ అయిపోయారు. ఈ ఉత్తర్వులు ఆలస్యం కావడం వలన సుమారు 300 మంది ఉద్యోగులు నష్టపోయారు. ఉత్తర్వులు జారీచేసిన రోజు నుంచే 62 ఏళ్ల నిబంధన అమల్లోకి అని స్పష్టం చేయడంతో జనవరిలో రిటైర్‌ అయిన వారికీ ఇది వర్తించకుండా పోయింది. కాగా.. బోధనేతర సిబ్బందికి 62 ఏళ్లు చేయడం పట్ల యూనివర్సిటీల బోధనేతర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటప్పారెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉన్నత విద్యా మండలికి లేదు

యూనివర్సిటీల పరిపాలనా వ్యవహారాలకు కేంద్ర బిందువైన ఉన్నత విద్యామండలికి తాజా ఆదేశాలు వర్తించవని అధికారులు స్పష్టం చేశారు. పదో షెడ్యూలులో ఉన్నప్పటికీ మండలి విభజన జరగలేదు. దీంతో ప్రస్తుతం ఏపీ ఉన్న త విద్యామండలిలో ఇద్దరు మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగులున్నారు. వారికి 62 ఏళ్లు వర్తింపజేయడం ఇష్టంలేకే మండలి అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు పంపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు అకాడమీకి కూడా తాజా ఆదేశాలు వర్తించవని అధికారులు తెలిపారు.

Updated Date - Feb 15 , 2024 | 08:06 AM