Share News

5,472 చీరలు సీజ్‌

ABN , Publish Date - Mar 22 , 2024 | 03:34 AM

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎన్నికల అధికారులు భారీగా చీరలు సీజ్‌ చేశారు. గురువారం ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సత్తెనపల్లి పారిశ్రామికవాడలోని ఒక గోదాంలో తనిఖీలు నిర్వహించి 114 బాక్సులలో ఉన్న 5,472 చీరలను స్వాధీనం చేసుకున్నారు.

5,472 చీరలు సీజ్‌

బాక్సులపై సీఎం జగన్‌ బొమ్మ

ఓటర్లకు పంచేందుకు సత్తెనపల్లిలో దాచిన అధికార పార్టీ నేతలు!

సత్తెనపల్లి, మార్చి 21: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎన్నికల అధికారులు భారీగా చీరలు సీజ్‌ చేశారు. గురువారం ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సత్తెనపల్లి పారిశ్రామికవాడలోని ఒక గోదాంలో తనిఖీలు నిర్వహించి 114 బాక్సులలో ఉన్న 5,472 చీరలను స్వాధీనం చేసుకున్నారు. మహిళా ఓటర్లకు పంపిణీ చేసేందుకు పెరుమళ్ల గోపాల్‌ గోదాంలో వైసీపీ నేతలు చీరలు నిల్వ చేశారనే సమాచారం అందడంతో నియోజకవర్గ ఎన్నికల అధికారి మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి నరసింహారావు, వీఆర్‌ఓలు, పోలీసులు గోదాం వద్దకు చేరుకున్నారు. గోదాంకు తాళాలు వేసి ఉండడంతో గోదాం నిర్వాహకులకు ఫోన్‌ చేశారు. ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో తాళాలు పగులగొట్టి గోదాంలోకి వెళ్లారు. గోదాంలో 114 బాక్సులలో 5,472 చీరలు ఉన్నట్లు గుర్తించారు. బాక్సులన్నీంటిపై సీఎం జగన్‌ ఫొటోలు ముద్రించి ఉన్నాయి. సరుకును సీజ్‌ చేసి పట్టణ పోలీసుస్టేషన్‌ తరలించారు. ఈ సమయంలో సౌందర్య సిల్క్‌ యజమాని, వైసీపీ నాయకుడు భవిరిశెట్టి సుబ్రహ్మణ్యం చీరలు తనవే అంటూ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారికి తెలిపారు. గోదాంను 3 రోజుల క్రితం లీజుకు తీసుకున్నామని, అగ్రిమెంటు పత్రాలు లేవని తెలిపారు. లోపల ఉన్న చీరల స్టాక్‌ వివరాలు ఆయన చెప్పలేకపోయారు. మొత్తం రూ.33లక్షల విలువైన స్టాక్‌ తీసుకువచ్చినట్లు తెలిపారు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

Updated Date - Mar 22 , 2024 | 03:34 AM