Share News

పోలవరానికి ఇవ్వాల్సింది ఇక 521 కోట్లే!

ABN , Publish Date - May 30 , 2024 | 02:07 AM

పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ నిర్మాణాల్లో కీలకమైన కట్టడాలు దెబ్బతినిపోయాయి. డయాఫ్రం వాల్‌ కొత్తగా నిర్మించాల్సి ఉంది.

పోలవరానికి ఇవ్వాల్సింది ఇక 521 కోట్లే!

వెబ్‌సైట్లో స్పష్టం చేసిన పీపీఏ... 12,911 కోట్ల హామీ ఊసేదీ?

అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ నిర్మాణాల్లో కీలకమైన కట్టడాలు దెబ్బతినిపోయాయి. డయాఫ్రం వాల్‌ కొత్తగా నిర్మించాల్సి ఉంది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటి నుంచి సీపేజీ జోరుగా వస్తోంది. దీంతో వీటి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. డయాఫ్రం వాల్‌ దెబ్బతినడంతో.. దానిపై మట్టి, రాతితో కూడిన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం కట్టడం సాధ్యం కాదు. ఇదే తరుణంలో గైడ్‌ బండ్‌ కుంగిపోయింది. ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేయడానికి రూ.21వేల కోట్లు ఖర్చవుతుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేయగా.. రూ.12,911.13 కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ, జలశక్తి శాఖ లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చాయి. దీనిని నెరవేర్చాలంటే కేంద్ర మంత్రివర్గ ఆమోదం పొందాల్సి ఉంది. గడచిన ఏడాదిగా ఇదిగో... అదిగో అంటూ రాష్ట్రప్రభుత్వం ఊదరగొట్టింది. తీరా పోలవరం (2014-15) అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లలో 2014నాటికి రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన 4,730.71కోట్లు మినహా యిస్తే ఇవ్వాల్సింది 15,667.90కోట్లేనని.. ఇందులోనూ ఇప్పటికే రూ.15,146.28 కోట్లు చెల్లించేశామని.. ఇంకా రూ.521.62 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందంటూ పీపీఏ తన వెబ్‌సైట్‌లో తేల్చి చెప్పింది.

పీపీఏ సీఈవోగా అతుల్‌ జైన్‌ బాధ్యతలు స్వీకరణ

పీపీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా అతుల్‌ జైన్‌ బుధవారం అదనపు బాధ్యతలను స్వీకరించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న జైన్‌కు పీపీఏ సీఈవోగా అదనపు బాధ్యతలను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అప్పగించింది.

Updated Date - May 30 , 2024 | 07:45 AM