Share News

బదిలీల స్కామ్‌ 50 కోట్లు

ABN , Publish Date - Mar 14 , 2024 | 05:01 AM

ఉపాధ్యాయుల బదిలీల్లో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. ఉపాధ్యాయులను ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేసేందుకు ఏకంగా రూ.50 కోట్లను అధికార పార్టీ నేతలు మెక్కేశారు. సుమారు 1200 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు సంబంధించిన ఆర్డర్లను తాజాగా పాఠశాల

బదిలీల స్కామ్‌ 50 కోట్లు

భారీ స్థాయిలో టీచర్ల అక్రమ బదిలీలు

క్షేత్రస్థాయి నుంచే వసూళ్లు ప్రారంభం

మొదట ప్రజాప్రతినిధుల సిఫారసులు

ఆ తర్వాత పైస్థాయిలో కదిలిన ఫైళ్లు

రెండు చోట్లా సమర్పించుకున్న టీచర్లు

రెండు జిల్లాల డీఈవోలపై దౌర్జన్యం

చివరికి కమిషనరేట్‌ నుంచి ప్రక్రియ

అక్రమ బదిలీల ఆర్డర్లు విడుదల

అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల్లో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. ఉపాధ్యాయులను ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేసేందుకు ఏకంగా రూ.50 కోట్లను అధికార పార్టీ నేతలు మెక్కేశారు. సుమారు 1200 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు సంబంధించిన ఆర్డర్లను తాజాగా పాఠశాల విద్యాశాఖ జిల్లాలకు పంపింది. అయితే, ఆరోపణల నేపథ్యంలో డీఈవోలు వాటిని వెంటనే బయటపెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. కాగా, తాజాగా వసూలు చేసిన రూ.50 కోట్లు అధికార పార్టీకి చెందిన కీలక నేత తన నియోజకవర్గంలో పంపకాలకు ఉపయోగించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కేవలం ఎన్నికల ఖర్చుల కోసమే అక్రమ బదిలీలకు ఆయన ద్వారాలు తెరిచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైస్థాయిలో కీలక నేత, అధికారుల వసూళ్లతో పాటు.. క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల వద్ద సిఫారసు లేఖలకు కూడా ముడుపులు సమర్పించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.

సిఫారసు లేఖలకూ పిండేశారు

గతేడాది టీచర్ల సాధారణ బదిలీలు జరిగిన వెంటనే కోరుకున్న స్థానాలు దక్కని టీచర్లు వెంటనే పైరవీలు మొదలుపెట్టారు. దీనికిగాను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార పార్టీలోని కీలక నేతల వద్దకు వెళ్లి సిఫారసు లేఖలు తెచ్చుకున్నారు. ఇక్కడి నుంచే వసూళ్లు మొదలుపెట్టినట్లు తెలిసింది. కేవలం సిఫారసు లేఖలు ఇచ్చినందుకు ఒక్కో లేఖకు రూ.50 వేల నుంచి రూ.లక్ష తీసుకున్నారని సమాచారం. అయితే, అవన్నీ తమకు సంబంధం లేదని, తమ పీఏలు తీసుకున్నారేమో తెలియదంటూ లేఖలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కానీ, పీఏల పేరుతో నేరుగా ప్రజాప్రతినిధులే సిఫారసుల వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యే సగటున పది మంది ఉపాధ్యాయుల బదిలీకి సిఫారసు చేశారని, తద్వారా రూ.10 లక్షల వరకు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరులో ‘పెద్ద’ నేతగా పేరున్న ఓ మంత్రి ఏకంగా 200 లేఖలు ఇచ్చారు. సీఎంకు అత్యంత సన్నిహితుడైన రాయలసీమ ఎంపీ 200 లేఖలు, ప్రకాశం జిల్లాలో అసంతృప్తవాదిగా పేరున్న ఓ అధికార పార్టీ నేత 200 లేఖలు ఇచ్చారు. రాయలసీమలో పాణ్యం, శ్రీశైలం, ఆళ్లగడ్డ ప్రాంతాల నుంచి భారీగా సిఫారలు లేఖలు పాఠశాల విద్యాశాఖకు వచ్చాయి. గుంటూరు జిల్లాలోని ఓ ఎమ్మెల్సీ అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల టీచర్లకు భారీగా లేఖలు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కేవలం ఒకే ఒక్క సీనియర్‌ మంత్రి కనుసన్నల్లో సిఫారసులు నడిచాయి.

సీఎంవో పేరుతోనూ బదిలీలు

టీచర్ల అక్రమ బదిలీల్లో వసూళ్లకు ప్రధాన కేంద్రం కీలక నేత కార్యాలయమే అయినా, సిఫారసులు అన్ని వైపుల నుంచీ అందాయి. ప్రభుత్వంలో అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరించే ఓ సలహాదారు ఇష్టానుసారంగా సిఫారసు లేఖలు ఇచ్చారని తెలిసింది. ఇక సీఎంవోలోని కొందరు అధికారులు ఇదే పంథా కొనసాగించారు. సీఎంవో బదిలీల పేరుతో గతంలోనే 130 మందిని అక్రమంగా బదిలీ చేయగా, ఇప్పుడు కొనసాగింపుగా మరో 1200 మందిని చేశారు. చివరికి ఓ గ్రామ సర్పంచ్‌ సిఫారసు లేఖను కూడా టీచర్‌ బదిలీకి రిఫరెన్స్‌గా పెట్టారు. పలుకుబడి ఉంటే ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా వెయ్యి మందికి పైగా టీచర్లకు అక్రమ బదిలీలు చేశారు.

డీఈవోలనే భయపెట్టారు

ఈ సిఫారసు బదిలీలు చేయడం తమవల్ల కాదంటూ రెండు జిల్లాల డీఈవోలు ఏకంగా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు వచ్చి గగ్గోలు పెట్టే స్థాయిలో ఈ అక్రమాల వ్యవహారం కొనసాగింది. ఇద్దరు రాయలసీమ జిల్లాల డీఈవోలు తమపై ఒత్తిడి పెరుగుతోందని, ఒక్క ఖాళీకి పది లేఖలు ఇస్తున్నారని, ప్రజాప్రతినిధుల దౌర్జన్యం భరించలేకపోతున్నామంటూ గగ్గోలు పెట్టారు. మూడు నెలల కిందట ఈ ఘటనలు జరగ్గా, ఇక లాభం లేదనుకుని మొత్తం లేఖలను కమిషనరేట్‌కు తెప్పించుకుని పైస్థాయి నుంచే బదిలీలు చేసేశారు. ఈ క్రమంలో పైస్థాయిలో కీలక నేత పీఏ అడ్డగోలుగా వసూళ్లు చేశారు. ఎలాగూ ఇంతదూరం వచ్చాం కదా అనుకున్నారో ఏమోగానీ పైస్థాయిలో అడిగినంత ఇచ్చి ఉపాధ్యాయులు బదిలీ ఆదేశాలు తీసుకున్నారు.

ఇదీ వసూళ్ల లెక్క

బదిలీలు కోరిన టీచర్లలో ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు తగ్గకుండా వసూలు చేశారు. మొదట 1400 మంది పేర్లను పరిశీలించగా, చివరికి 1200 మందికి ఆర్డర్లు ఇచ్చేశారు. ఇందులో అతి తక్కువ మందికి మాత్రమే పలు కారణాలతో నగదు లేకుండా బదిలీ చేశారు. దాదాపు 1100 మంది ముడుపులు సమర్పించుకున్నారు. వీరిలో కొందరు తక్కువ ఇచ్చినా మొత్తంగా కలిపి కనీసం రూ.50 కోట్లు వసూలు చేసినట్లు పాఠశాల విద్యాశాఖలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ఉపాధ్యాయ సంఘాల జోక్యం

ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తున్నామని చెప్పుకొనే కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలూ అక్రమ బదిలీల్లో తల దూర్చారని సమాచారం. నేరుగా వారి పేరుతో కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులతో లేఖలు తీసుకుని, వాటిని కమిషనరేట్‌లో ఇచ్చి బదిలీలు చేయించుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బలంగా ఉండే, రాష్ట్రంలో టీచర్ల బలం లేని ఓ సంఘం నేతలు 50 మందికి పైగా బదిలీలు చేయించినట్లు తెలిసింది. మరో సంఘం నేతలు కూడా కొద్ది మందికి బదిలీలు చేయించారు. ఇక తమ సంఘమే అధికార పార్టీకి చెందినది చెప్పుకొనే సంఘం నేతలు కూడా బదిలీలు చేయించారు. ఈ క్రమంలో టీచర్ల నుంచి మరికొంత వసూలు చేసి ఆ సంఘాల నేతలు జేబులు నింపుకొన్నారని తెలుస్తోంది.

Updated Date - Mar 14 , 2024 | 05:01 AM