Share News

పేద కుటుంబానికి నెలకు 5 వేలు!

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:01 AM

ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఇది కాంగ్రెస్‌ గ్యారెంటీ అని ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు.

పేద కుటుంబానికి నెలకు 5 వేలు!

ఏపీలో అధికారంలోకి రాగానే అమలు.. ఇది కాంగ్రెస్‌ గ్యారెంటీ: ఏఐసీసీ చీఫ్‌

సీఎం జగన్‌ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.. అనంత కాంగ్రెస్‌ సభలో మండిపడ్డ ఖర్గే

అనంతపురం ఫిబ్రవరి 26(ఆంఽద్రజ్యోతి): ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఇది కాంగ్రెస్‌ గ్యారెంటీ అని ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. అనంతపురంలో సోమవారం కాంగ్రెస్‌ నిర్వహించిన ‘న్యాయ సాధన సభ’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘‘పోరాడుదాం.. సాధిద్దాం.. నిర్మిద్దాం.. నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పునరంకితమైంది’’ అని తెలిపారు. ఇప్పటికే అధికారంలో ఉన్న కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ర్టాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. ‘‘వారు మోదీకి జీ హుజూర్‌ అంటున్నారు. అందుకే మోదీకి అహంకారం పెరిగింది. ప్రతి దానికీ నేను.. నేను అంటున్నారు. ‘నేను’ అనేవాడు కావాలో.. ‘మనం’ అనే కాంగ్రెస్‌ కావాలో ప్రజలు ఆలోచించాలి’’ అని పిలుపునిచ్చారు. ఏపీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఇండియా కూటమికి మద్దతివ్వాలని కోరారు. కాంగ్రెస్‌ హయాంలోనే పేదలు, మహిళలు, రైతులు, కార్మికులకు న్యాయం జరిగిందని అన్నారు. కాంగ్రెస్‌ ఏపీకి హక్కులు ఇచ్చిందని, పదేళ్లుగా ఢిల్లీ నుంచి ఒక్కపైసా ఇవ్వలేదని విమర్శించారు. ‘‘మీ హక్కులను సాధించిపెట్టడమే కాంగ్రెస్‌ అజెండా’’ అని ఖర్గే తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరం పూర్తి చేయకుండా, వెనుకబడిన ప్రాంతాలకు పైసా నిధులు ఇవ్వకుండా.. తడిగుడ్డతో గొంతుకొస్తున్న మోదీకి ఊడిగం చేస్తున్నారెందుకని జగన్‌ సహా ఇతర పార్టీల నేతలపై ఖర్గే మండిపడ్డారు. సభలో మాణిక్కం ఠాగూర్‌, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, పల్లంరాజు, జేడీ శీలం, బాపిరాజు, గిడుగు రుద్రరాజు, శైలజానాథ్‌, సుంకర పద్మశ్రీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 09:30 AM