Share News

41ఏ నిబంధనలు పాటించలేదు

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:39 AM

సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో నమోదైన కేసులో సీఆర్పీసీ సెక్షన్‌ 41(ఏ) నిబంధనలు పాటించని పోలీసులుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో

41ఏ నిబంధనలు పాటించలేదు

సుప్రీం మార్గదర్శకాలను అనుసరించలేదు

హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు.. నోటీసులు జారీ

అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో నమోదైన కేసులో సీఆర్పీసీ సెక్షన్‌ 41(ఏ) నిబంధనలు పాటించని పోలీసులుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న గుంటూరు జిల్లా అప్పటి ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, మంగళగిరి అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ అప్పటి ఇన్‌స్పెక్టర్‌ శీలం శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ ఇ.నారాయణలకు వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు సోమవారం ఆదేశాలిచ్చారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో నమోదుచేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్‌ 41(ఏ) నిబంధనలు పాటించలేదని, అర్నే్‌షకుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించకుండా నేరుగా అరెస్ట్‌ చేశారని, దీనికి బాధ్యులైన పోలీసు అధికారులను శిక్షించాలని కోరుతూ కె.వేణు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. షేక్‌ నయబ్‌ రసూల్‌ దాఖలు చేసిన మరో కోర్టు ధిక్కరణ కేసులో అప్పటి ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, అప్పటి మంగళగిరి గ్రామీణ ఇన్‌స్పెక్టర్‌, ఎస్సైలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Updated Date - Feb 20 , 2024 | 08:24 AM