శ్రీవారి ఆర్జిత సేవలకు నకిలీ ఆధార్‌లతో 400 రిజిస్ర్టేషన్లు
ABN , Publish Date - Jul 24 , 2024 | 04:19 AM
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు పొందేందుకు 400సార్లు రిజిస్ర్టేషను చేసిన ఇద్దరు వ్యక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించిన విజిలెన్స్ అధికారులు
తిరుమల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు పొందేందుకు 400సార్లు రిజిస్ర్టేషను చేసిన ఇద్దరు వ్యక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా చుండూరుకు చెందిన సాయిసునీల్, ఏవీఎస్ గుప్తా సోదరులు పేరు, చిరునామాలను అలానే ఉంచి ఆధార్ నంబర్లను మారుస్తూ 400కు పైగానే రిజిస్ర్టేషన్లు చేసినట్టు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. ఇలా పొందిన సుప్రభాతసేవలో పాల్గొనేందుకు మంగళవారం వేకువజామున వారు తిరుమలకు రాగా విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు ఆధార్ కార్డును పరిశీలించడంతో వీరి బండారం బయటపడింది. మొదటి సేవలో పాల్గొనేందుకు వచ్చిన వీరిని తిరుమల టూటౌన్ పోలీసులకు అప్పగించారు. ఒకే నంబరు, మెయిళ్ల ద్వారా బల్క్ రిజిస్ర్టేషన్లు చేస్తున్న వారిపై టీటీడీ నిఘా పెట్టిన క్రమంలో వీరిద్దరూ పట్టుబడ్డారు.