Share News

నన్ను ఓడించేందుకు 300 కోట్లు పంపారు

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:09 AM

ముఖ్యమంత్రి జగన్‌ తనను మంగళగిరిలో ఓడించేందుకు రూ.300 కోట్లు పంపించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

నన్ను ఓడించేందుకు 300 కోట్లు పంపారు

తాడేపల్లి రచ్చబండలో లోకేశ్‌

తాడేపల్లి టౌన్‌, మార్చి 23: ముఖ్యమంత్రి జగన్‌ తనను మంగళగిరిలో ఓడించేందుకు రూ.300 కోట్లు పంపించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఈ డబ్బులు ఆయన గంజాయి, ఇసుక, మద్యం అమ్మి సంపాదించారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో లోకేశ్‌ పాల్గొన్నారు. ‘‘ప్రజలు అప్రమత్తంగా ఉండి వైసీపీ కుట్రలు తిప్పి కొట్టాలి. మాయమాటలకు మోసపోవద్దు’’ అని ప్రజలను కోరారు. టీడీపీ హయాంలో నేరుగా కాలేజీలకు ఫీజు రీయింబర్సుమెంటు నిధులు చెల్లించేవారమని, జగన్‌ వచ్చిన తర్వాత కాలేజీలకు బకాయిలతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందని దుస్థితి నెలకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే పాతఫీజు రీయింబర్సుమెంట్‌ విధానం తీసుకువస్తామని, విద్యార్థులకు ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసి సర్టిఫికెట్లు అందేలా చూస్తామని లోకేశ్‌ భరోసా ఇచ్చారు. పేదలకు విద్యను దూరం చేసే ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీన జీవో 117ను రద్దు చేస్తామన్నారు. వైసీపీ పాలనలో గంజాయి ప్రతి గడపను తాకిందని, దీనివల్ల ఒక తరం నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లి డోలా్‌సనగర్‌లో ప్రచారం చేస్తుండగా.. ఓ తల్లి తనను కలిసిందని, తన పిల్లలు గంజాయికి బానిసలయ్యారని వాపోయిందని తెలిపారు. గంజాయి విజృంభనకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబే కారణమని, ఆయన తన దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని జగన్‌ తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Mar 24 , 2024 | 03:09 AM