Share News

25 వేల మంది టీచర్లు ఇంటికే!

ABN , Publish Date - Apr 23 , 2024 | 05:02 AM

పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.

25 వేల మంది టీచర్లు ఇంటికే!

ఎనిమిదేళ్లుగా తీసుకున్న జీతాలు

4 వారాల్లో వడ్డీతోసహా చెల్లించాల్సిందే

బెంగాల్‌లో 2016 ఉపాధ్యాయ

నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు

15 రోజుల్లోగా నియామక ప్రక్రియ

చేపట్టాలని బెంగాల్‌ సర్కారుకు ఆదేశం

దర్యాప్తు కొనసాగించి 3 నెలల్లో నివేదిక

ఇవ్వాలని సీబీఐకి సూచన

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తాం

బాధితులకు అండగా ఉంటాం

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

కోల్‌కతా, ఏప్రిల్‌ 22: పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. మమత సర్కారు రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్‌ఎల్‌ఎ్‌సటీ) ద్వారా 2016లో జరిపిన బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేసింది. ఈ తీర్పుతో 25,753 మంది ఉద్యోగాలను కోల్పోయారు. వారి నియామక ప్రక్రియ చెల్లదని జస్టిస్‌ దేబాంగ్సు బసక్‌, జస్టిస్‌ మహ్మద్‌ షబ్బార్‌ రషీదీతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తేల్చిచెప్పింది. అంతేకాదు.. అక్రమంగా ఉద్యోగాలు పొందినవారంతా గత ఎనిమిదేళ్లుగా తాము తీసుకున్న జీతాలను వడ్డీతో సహా.. నాలుగు వారాల్లోగా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొంది. వసూలు బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. అలాగే.. ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీకి 15 రోజుల్లోగా కొత్తగా నియామక ప్రక్రియ చేపట్టాలని ఆ రాష్ట్ర స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఆదేశించింది. ఈ స్కామ్‌పై సమగ్ర విచారణ జరిపి 3 నెలల్లో సీబీఐతో తదుపరి విచారణకు ఆదేశాలు జారీచేసింది.

ఉపాధ్యాయ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన పలువురు అభ్యర్థులు తీర్పు రాగానే కోర్టు వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడి హర్షం వ్యక్తం చేశారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ తీర్పుపై స్పందించారు. బీజేపీ నాయకులు న్యాయవ్యవస్థను, తీర్పులను సైతం ప్రభావితం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై 2022 మేలో సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్‌ గంగోపాధ్యాయ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బీజేపీలో చేరి, ఇప్పుడు తామ్లుక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని ఆమె పరోక్షంగా గుర్తుచేస్తూ.. ఇది ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఒక వ్యక్తి ఇచ్చిన ఆదేశాల ఫలితమని వ్యాఖ్యానించారు. న్యాయదేవత రోదిస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ తీర్పును తాము సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్ల జీతాన్ని నాలుగువారాల్లోగా చెల్లించడం సాధ్యమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలేమిటీ కేసు?

పశ్చిమబెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌.. 2014లో రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్ల నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చింది. రాష్ట్రస్థాయి నియామక పరీక్ష నిర్వహించి 2016లో నియామక ప్రక్రియ ప్రారంభించింది. 24,640 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. చివరికి 25,753 మంది నియమితులయ్యారు. కానీ, ఈ నియామక ప్రక్రియలో పలు లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమకన్నా తక్కువ మార్కులు వచ్చినవారికి తమకన్నా మెరుగైన ర్యాంకు ఇచ్చారని.. అసలు మెరిట్‌ లిస్టులో లేని అభ్యర్థులకూ నియామక పత్రాలు అందాయని హైకోర్టుకు మొరపెట్టుకున్నారు. ఇదిలా కొనసాగుతుండగానే.. 2016లో బెంగాల్‌ సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 13 వేల గ్రూప్‌-డీ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ పోస్టుల నియామకానికి సంబంధించిన ప్యానెల్‌ తుదిగడువు 2019లో ముగిసిపోయిన తర్వాత కూడా 25 మందిని నియమించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ సీబీఐ విచారణకు ఆదేశించారు.

ఈమేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. 2014లో నిర్వహించిన పరీక్షలో అవకతవకలు జరిగాయని తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ పరీక్షలో ఫెయిల్‌ అయినవారికి, అనర్హులకు సైతం ప్రాథమిక పాఠశాలల్లో అసిస్టెంట్‌ టీచర్లుగా పోస్టులు ఇచ్చారని వెల్లడించింది. ఈ అక్రమాలన్నీ జరుగుతున్న సమయంలో విద్యామంత్రి.. పార్థ చటర్జీ. సీబీఐ ఈ విచారణ చేపట్టే సమయానికి ఆయన ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. సీబీఐ ఆయన్ను రెండుసార్లు ప్రశ్నించింది. 2022 జూలై 23న పార్థ చటర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న అర్పితా ముఖర్జీ ఇంట్లో దాడులు చేసిన ఈడీ రూ.21కోట్ల నగదు, రూ.కోటి విలువ చేసే నగలను స్వాధీనం చేసుకుంది. పార్థచటర్జీని అరెస్టు చేసింది. వారిద్దరికీ సంబంధించిన రూ.103.10 కోట్ల విలువైన నగదు, నగలు, స్థిరాస్తులను జప్తు చేసినట్టు 2022 సెప్టెంబరులో కోర్టుకు తెలిపింది. అలాగే.. ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ మాజీ సలహాదారు శాంతిప్రసాద్‌ సిన్హా, ప్రసన్నరాయ్‌ అనే మరో వ్యక్తికి చెందిన రూ.230 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.

సువేందుకు ముందే ఎలా తెలుసు?

‘‘సోమవారం దాకా వేచి చూడండి. ఓ భారీ (రాజకీయ) పేలుడు.. మేనత్త-మేనల్లుళ్ల పార్టీ (టీఎంసీ)ని కుదిపేస్తుంది. దాన్నుంచి వారు తేరుకోలేరు’’ ..బీజేపీ నేత సువేందు అధికారి కిందటివారం చేసిన ప్రకటన ఇది. సువేందు అధికారి ఈ ప్రకటన చేసింది సోమవారంనాటి హైకోర్టు తీర్పుగురించేనని.. ఈ తీర్పు గురించి బీజేపీకి అసలు ముందే ఎలా తెలిసిందని తృణమూల్‌ నేతలు మండిపడుతున్నారు. అయితే.. తాను టీఎంసీలో అంతర్గత కలహాల గురించే అలా మాట్లాడానని సువేందు అన్నారు.

అప్పట్లో చౌతాలా..

ఇప్పుడు బెంగాల్‌లో జరిగినట్టే.. దాదాపు 24 సంవత్సరాల క్రితం హరియాణాలోనూ టీచర్ల నియామకంలో కుంభకోణం జరిగింది. ఆ కేసులో.. హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలా 2013లో జైలు పాలయ్యారు. 2000 సంవత్సరంలో నాటి హరియాణా సర్కారు ఫోర్జరీ డాక్యుమెంట్లతో 3208 మంది టీచర్లను అక్రమంగా నియమించిందంటూ నమోదైన కేసుపై విచారణ జరిపిన కోర్టు.. వీరిని దోషులుగా నిర్ధారించింది.

Updated Date - Apr 23 , 2024 | 05:02 AM