Share News

జనసేనకు 24 సీట్లు

ABN , Publish Date - Feb 25 , 2024 | 03:48 AM

వచ్చే ఎన్నికల్లో 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

జనసేనకు 24 సీట్లు

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

టీడీపీ, జనసేన ఓట్లు బదిలీ కావాలి.. త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం

గట్టి పోటీ ఇవ్వాలనే 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు తీసుకున్నాం: పవన్‌

తెనాలి నుంచి నాదెండ్ల, అనకాపల్లి నుంచి కొణతాల.. 5 పేర్లు ప్రకటన

బలరాం, నానాజీ, మాధవికి టికెట్లు.. 2,3 రోజుల్లో మిగిలిన పేర్లు వెల్లడి

2019 నుంచి అరాచకపాలనలో నలుగుతున్నాం. ఇలాంటి సమయంలో బాధ్యతతో ఆలోచించాం. ‘కొందరు 45 సీట్లు కావాలి, 75 కావాలి’ అని అన్నారు. 2019లో 10 స్థానాలన్నా గెలిచి ఉంటే నేడు ఎక్కువ స్థానాలు అడగడానికి అవకాశం ఉండేదని వారితో అప్పుడే చెప్పాను. అందుకే తక్కువ స్థానాల్లో పోటీ చేసినా గట్టి పోటీ ఇవ్వాలని 24 స్థానాల్లో బరిలోకి దిగుతున్నాం.

- పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. శనివారం ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ఎక్కువ స్థానాలు తీసుకుని ప్రయోగం చేసే కంటే తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేలా ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రాన్ని దారిలో పెట్టడమే లక్ష్యమని, పార్టీ, వ్యక్తిగత ప్రయోజనాలు దాటి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నామన్నారు. పార్లమెంట్‌ స్థానాల పరిధిని కలుపుకొంటే 40స్థానాల్లో పోటీ చేస్తున్నట్లే లెక్క అన్నారు. టీడీపీ-జనసేన పొత్తు బలంగా ఉండాలని బీజేపీని దృష్టిలో పెట్టుకున్నామన్నారు. నాయకులందరూ వ్యక్తిగత ప్రయోజనాలు పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే త్యాగాలు చేసిన వారికి ప్రతిభను బట్టి భవిష్యత్తులో ప్రతిఫలం ఉంటుందని హామీ ఇచ్చారు. జనసేన ఓటు టీడీపీకి వెళ్లడం ఎంత ముఖ్యమో, టీడీపీ ఓటు జనసేనకు వెళ్లడమూ అంతే ముఖ్యమన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, ఇరు పార్టీ నేతల మధ్య పొరపొచ్చాలు రాకూడదన్నారు. ‘ఆయన(జగన్‌) సిద్ధం అంటున్నాడు. మేం యుద్ధం చేస్తాం. మనం గెలుస్తున్నాం. మన ప్రభుత్వం రాబోతుంది’ అని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఆచితూచి ప్రకటన

జనసేన అభ్యర్థుల ప్రకటన విషయంలో పవన్‌ ఆచితూచి వ్యవహరించారు. 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించినా, ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్‌, నెలిమర్ల నుంచి లోకం మాధవి, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్‌ నుంచి పంతం నానాజీ, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో రెండు, విజయనగరంలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, గుంటూరు జిల్లాలో ఒక స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. బ్రాహ్మణ, గవర, కమ్మ నుంచి ఒక్కొక్కరికి, ఇద్దరు కాపులకు సీట్లు ప్రకటించారు. టికెట్లు పొందినవారిలో నాదెండ్ల మనోహర్‌ తొలి నుంచి పవన్‌ వెన్నంటే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లోకం మాధవి ఇస్రోలో పని చేశారు. 2019లో కూడా నెల్లిమర్ల నుంచి పోటీ చేసిన ఆమె పార్టీ కోసం ఎంతో కష్డపడుతున్నారు. ఇటీవల పార్టీలో చేరిన సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు ప్రాధాన్యం ఇచ్చి టికెట్‌ కేటాయించారు. ఆయన అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గమంతా ప్రభావం చూపగల నాయకుడు. ఇక బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. స్థానికంగా టీడీపీ నేతలను కలుపుకొని వెళ్తున్నారు.

‘24’కు ప్రత్యేకత

జనసేన 24 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్‌ ప్రకటించిన ఆ సంఖ్యకు ఓ ప్రత్యేకత ఉంది. 2024లో అందులోనూ ఫిబ్రవరి 24వ తేదీన 24 స్థానాల్లో పోటీ చేస్తామని పవన్‌ ప్రకటించారు. ఇలా సంవత్సరం, తేదీ, సీట్ల సంఖ్యలో ‘24’ ఉండటం విశేషం. ఇది యాదృచ్ఛికమైనా మూడు ‘24’లు రావడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదేదో కలిసొచ్చే అంశంగా భావించే అధినేత ఇలా మూడు 24లు వచ్చేలా ప్లాన్‌ చేశారని కొంతమంది నాయకులు అంటున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 03:50 AM