Share News

1బీ కష్టాలు

ABN , Publish Date - May 27 , 2024 | 12:01 AM

పంట రుణాలు విడుదల చేసే సీజన్‌లో రైతులు వ్యవసాయ పంట రుణాలు రెన్యువల్‌ చేసే సీజన్‌లో రైతులకు 1బీ కష్టాలు వెంటాడుతున్నాయి.

1బీ కష్టాలు

సచివాలయాల్లో నో స్టాక్‌..

పంట రుణాల కోసం రైతుల తిప్పలు

మద్దికెర, మే 26: పంట రుణాలు విడుదల చేసే సీజన్‌లో రైతులు వ్యవసాయ పంట రుణాలు రెన్యువల్‌ చేసే సీజన్‌లో రైతులకు 1బీ కష్టాలు వెంటాడుతున్నాయి. గ్రామ సచివాలయాల్లో 1బీ పత్రాలు స్టాక్‌ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట రుణాలు సకాలంలో రెన్యువల్‌ చేయకపోతే.. వడ్డీ పెరగడంతో పాటు వచ్చే ఏడాదికి పావలా వడ్డీ మొత్తం ఖాతాలో జమ కాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ఎలాగైనా రుణాలు జమ చేయాలని 1బీ పత్రాల కోసం రైతులు గ్రామ సచివాలయాలకు పరుగులు పెడుతున్నారు. అయితే , పత్రాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మండలంలో 11 గ్రామాల్లో ఖరీఫ్‌లో 7,500 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తారు. మండల రైతుల రుణాల కోసం కెనరా బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. దాదాపు ఆ బ్యాంకులో రూ.80 కోట్ల మేర రుణాలు తీసుకుంటారు. ప్రస్తుతం పంట రుణాలను రెన్యువల్‌ చేయాలంటే.. బ్యాంకులో తప్పనిసరిగా రైతుల భూముల వివరాలు 1బీ పత్రం మీద ప్రింట్‌ తియించి బ్యాంకులో అందజేయాలి. అలా చేస్తే రుణాలు ఇస్తారు. సచివాలయాల్లో 1బీ పత్రాల్లో జగన్‌ బొమ్మ ఉన్న పత్రాలు ఇవ్వకూడదని ఆదేశాలు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 1బీ పత్రాలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

Updated Date - May 27 , 2024 | 12:01 AM