నకిలీ బంగారంతో రూ.1.77 కోట్ల రుణం
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:04 AM
బాపట్ల బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర బ్రాంచ్‌లో నకిలీ బంగారంతో రూ.కోట్లు రుణం తీసుకున్న వ్యవహారం కలకలం రేపింది.

బాపట్ల బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో ఘరానా మోసం
రోజు కూలీలతో 41 ఖాతాలు తెరిపించిన కొందరు వ్యక్తులు
బాపట్ల, మార్చి 5: బాపట్ల బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర బ్రాంచ్‌లో నకిలీ బంగారంతో రూ.కోట్లు రుణం తీసుకున్న వ్యవహారం కలకలం రేపింది. పది రోజుల క్రితమే ఈ విషయం తెలిసినా బ్యాంక్ అధికారులు రహస్యంగా ఉంచారు. అయితే నకిలీ బంగారం తనఖా పెట్టించి తమకు కేవలం రూ.10 వేలు చొప్పున మాత్రమే ఇచ్చారని 18 మంది సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటివరకు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడిన బ్యాంక్ అధికారులు హడావుడిగా లెక్కలు తేల్చి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు రోజువారి కూలీ పనులు చేసుకునే 41మందితో ఖాతాలు ప్రారంభించి వారితో నకిలీ బంగారం తనఖా పెట్టించారు. 1,77,62,000 రుణం పొందారు. ఇటీవల బంగారు రుణాలపై ఆడిట్ జరగ్గా నకిలీ బంగారం వెలుగు చూసింది. పట్టణ సీఐ యు.శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది నవంబరు నెల నుంచి ఈ తంతు జరిగినట్లు సమాచారం. బ్యాంక్ అప్రైజర్ వెల్లటూరి రాఘవేంద్రరావు సహకారంతో కొంతమంది కలిసి ఈ విధంగా చేసినట్టు తెలిసింది. రాఘవేంద్రరావు ఇటీవల గంజాయి అనుమానిత కేసులో అరెస్టై జైలులో ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇంతపెద్ద మోసం జరిగినా బ్యాంక్ అధికారులకు తెలియకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇందులో ఓ రాజకీయపార్టీ నాయకుడి పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై సీఐ శ్రీనివాసులను వివరణ కోరగా దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.