డిగ్రీ, పీజీలో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 15 శాతం సీట్లు
ABN , Publish Date - Jan 29 , 2024 | 02:23 AM
తెలంగాణలో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీల్లో అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో
అన్ని యూనివర్సిటీలకు వర్తింపు
ఈ ఏడాది నుంచే అమలుకు చర్యలు
రాష్ట్ర విద్యార్థులకు నష్టం లేకుండా అదనపు సీట్లు సృష్టించేందుకు నిర్ణయం
హైదరాబాద్, చుట్టుపక్కల కాలేజీల్లో అడ్మిషన్లు పెరుగుతాయని అంచనా
హైదరాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీల్లో అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రాష్ట్ర విద్యార్థులకు నష్టం లేకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అదనపు సీట్లు సృష్టించనున్నారు. డిమాండ్‌ను బట్టి ఎప్పటికప్పుడు ఈ సీట్లు పెంచాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది (గత ప్రభుత్వ హయాంలో) ప్రయోగాత్మకంగా ఉస్మానియా యూనివర్సిటీ వంటి వాటిలో అమలుచేసిన ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో అమలు పరచనున్నారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న కాలేజీల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థుల అడ్మిషన్లు పెరగవచ్చని భావిస్తున్నారు. ఈ 15 శాతం సీట్లలో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. క్యాంపస్ ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో ఈ కోటా సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో పలు కొత్త విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరో ముందడుగు వేసి... ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 15 శాతం కోటా కల్పించింది. ఇప్పటికే రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ కోర్సుల నిర్వహణలో తీసుకొచ్చిన మార్పులను చూస్తే.. ముఖ్యంగా డిగ్రీ కోర్సుల్లో బకెట్ పద్ధతి ప్రవేశపెట్టారు. డిగ్రీలో ఒక కోర్సు చదువుతూనే మరో కోర్సులో కొన్ని సబ్జెక్టులు కూడా చదువుకునేలా ఈ పద్ధతి అమలు చేస్తున్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకుని, మరో కాలేజీలో క్లాసులకు హాజరయ్యేందుకు వీలు ఉంది.
ఈ మేరకు ఆయా కాలేజీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిర్చారు. వీటితో పాటు దేశ, విదేశాలకు చెందిన యూనివర్సిటీలతో కూడా ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో ఇక్కడి విద్యార్థులు కొన్ని రోజుల పాటు ఇతర దేశాలకు వెళ్లి అక్కడ చదువుకుని రావడానికి అవకాశం ఉంది. అలాగే విదేశీ విద్యార్థులు కూడా రాష్ట్రానికి రావచ్చు. స్కిల్ డెవల్‌పమెంట్ పేరిట డిగ్రీ స్థాయిలో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టారు. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా ముందుగానే ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. పైగా సదరు విద్యార్థులకు ఆయా సంస్థలు స్టయిపండ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు పీజీ చేయడానికి వీలుగా ఆయా కోర్సుల్లో కొంతమేర మార్పులు తీసుకొచ్చారు. అలాగే డిగ్రీలో ఒక కోర్సు చదివి.. పీజీలో మరో కోర్సు చేసేందుకు కూడా అవసరమైన మార్పులు చేశారు. ఇలాంటి నిర్ణయాల ద్వారా డిగ్రీ, పీజీ కోర్సులకు డిమాండ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.