Share News

10 వేల కోట్లు కావాలి

ABN , Publish Date - Oct 27 , 2024 | 03:24 AM

ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల కోసం సుమారు 10 వేల కోట్లు అవసరమని రాష్ట్ర జలవనరుల శాఖ అంచనా వేసింది.

10 వేల కోట్లు కావాలి

సాగునీటి ప్రాజెక్టులపై జల వనరుల శాఖ నివేదన

ఇందులో రూ.2,309 కోట్లు బకాయిలకే

ప్రాజెక్టుల నిర్వహణకు నిధులివ్వని జగన్‌

ఐదేళ్లలో గేట్లకూ మొండిచేయి

అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల కోసం సుమారు 10 వేల కోట్లు అవసరమని రాష్ట్ర జలవనరుల శాఖ అంచనా వేసింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.4,000 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతలు-350 కోట్లు, గోదావరి-పెన్నా అనుసంధానం-879 కోట్లు, వెలిగొండ-248 కోట్లు, హంద్రీ-నీవా-182 కోట్లు, వంశధార ఫేజ్‌2 స్టేజ్‌2-రూ.92 కోట్లు, విదేశీ సహాయ (ఈఏపీ) ప్రాజెక్టులు-259 కోట్లు, వరద నివారణ పనులు-రూ.1,000 కోట్లు, ఆపరేషన్‌-నిర్వహణకు రూ.574 కోట్లు.. మొత్తంగా 7,609.31 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించింది. అలాగే జగన్‌ పెట్టిపోయిన బకాయిలు రూ.2,309.31 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. గత ఐదేళ్లలో ప్రాజెక్టు పనులకు నిధులివ్వని ఆయన.. చేసిన కొద్దిపాటి పనులకు కూడా బిల్లులు చెల్లించలేదు. పోలవరం ప్రాజెక్టుకు రూ.1,090 కోట్లు, చింతలపూడి-76.64 కోట్లు, వెలిగొండ-23.67 కోట్లు, హంద్రీ-నీవా-573 కోట్లు, వంశధార-36 కోట్లు, వంశధార ఫేజ్‌-2. స్టేజ్‌-2-రూ.36 కోట్లు, ఈఏపీ పథకాలు-139 కోట్లు, యాజమాన్య నిర్వహణకు రూ.410 కోట్లు బకాయిలు ఉన్నాయని జలవనరుల శాఖ తెలిపింది. జగన్‌ సర్కారు యాజమాన్య నిర్వహణ నిధులనూ బకాయిపెట్టి ంది. ఐదేళల్లో కాలువలన్నీ పూడుకుపోయాయి. భారీ వర్షం కురిస్తే నదీ పరివాహక ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. పోలవరం విధ్వంసానికి గురైంది. అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయింది. గేట్ల నిర్వహణకూ పైసా ఇవ్వలేదు. పులిచింతల గేట్లు తెగిపోయాయి. తుదకు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణకు కూడా నిధులివ్వలేదు.

పీడిస్తున్న ఇంజనీర్ల కొరత

జలవనరుల శాఖను ప్రస్తుతం ఇంజనీర్ల కొరత పీడిస్తోంది. గత ఐదేళ్లలో జగన్‌ సర్కారు నియామకాలే చేపట్టలేదు. ఈ శాఖలో 3,425 పోస్టులకు అనుమతులు ఉన్నాయి. ఇందులో సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్‌ (ఏఈఈ) పోస్టులు 2,569, సహాయ ఇంజనీర్‌ (ఏఈ) పోస్టులు 856 ఉన్నాయి. ప్రస్తుతం ఏఈఈ పోస్టులు 185, ఏఈ పోస్టులు 360 ఖాళీగా ఉన్నాయని బుధవారం నాటి సమీక్ష సందర్భంగా అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. తలో వంద చొప్పున భర్తీ చేసుకునేందుకు ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. కానీ ఆర్థిక శాఖ అడ్డుపుల్ల వేసింది. గ్రామ/వార్డు సచివాలయాల్లోని ఇంజనీర్ల సేవలను వినియోగించుకోవాలని ఆయన సమక్షంలోనే ఉచిత సలహా ఇచ్చింది. ఇక రాష్ట్ర స్థాయిలో జల వనరుల శాఖకు దిశానిర్దేశం చేసే మూడు ఇంజనీర్‌-ఇన్‌-చీ్‌ఫ (ఈఎన్‌సీ) పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. ప్రాజెక్టుల ఈఎన్‌సీ, పరిపాలనా ఈఎన్‌సీ, కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ బాధ్యతలు నిర్వర్తించే ఈఎన్‌సీ పోస్టులకు రెగ్యులర్‌ నియామకాల్లేవు. గతంలో రిటైరై ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎం.వెంకటేశ్వరరావు, సీఈగా ఉన్న కుమార్‌, ఆచార్యులు ఈఎన్‌సీలుగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే 19 చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) పోస్టులకు అనుమతి ఉంటే.. కేవలం రెండు పోస్టుల్లోనే రెగ్యులర్‌ సీఈలు ఉన్నారు. ఏకంగా 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్‌ఈ పోస్టులు 38, ఈఈ-126, డీఈఈ పోస్టులు 130 ఖాళీగా ఉన్నాయి. ఇన్ని పోస్టులను ఖాళీగా ఉంచి.. 45 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంపై సాగునీటి నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Oct 27 , 2024 | 03:24 AM