Share News

డ్వాక్రాలకు 10 లక్షలు

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:49 AM

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షల వరకు అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

డ్వాక్రాలకు 10 లక్షలు

వడ్డీ లేని రుణాలిస్తాం: చంద్రబాబు

మహిళలకు స్థానిక రిజర్వేషన్ల ఘనత టీడీపీదే.. చట్ట సభల్లోనూ కోటాకు కృషి

ఆస్తిలో సమాన హక్కు కల్పించాం.. మహిళలతో మరిన్ని స్కీంలు అమలు చేయిస్తాం

వారిని లక్షాధికారులను చేస్తాం.. ఎంత మంది పిల్లలున్నా అందరికీ తలో 15 వేలు

ప్రతి మహిళకూ నెలకు 1,500.. ఐదేళ్లలో వాటిని 9 లక్షలు చేసే బాధ్యత నాదే

ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం.. ఏటా మూడు ఉచిత సిలిండర్లు

పింఛన్‌ ఏప్రిల్‌ నుంచే 4 వేలు.. విద్యుత్‌ చార్జీలు పెంచం.. చెత్త పన్ను రద్దు

పెట్రో, నిత్యావసరాల ధరల నియంత్రణ.. జగన్‌ పాలనలో మహిళలకు రక్షణ లేదు

ఉత్తరాంధ్రను గంజాయి రాజధాని చేశాడు.. పిల్లలను బానిసలను చేస్తున్నాడు

జే బ్రాండ్‌ మద్యంతో చంపుతున్నాడు.. ప్రజాగళంలో టీడీపీ అధినేత ధ్వజం

పాతపట్నం, ఆమదాలవలసల్లో భారీ సభలు.. బొండపల్లిలో మహిళాగళం

శ్రీకాకుళం/విజయనగరం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షల వరకు అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తద్వారా వారిని సంపాదనపరులుగా, లక్షాధికారులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. దీనికి స్పష్టమైన ఆలోచనలు తన వద్ద ఉన్నాయన్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఆమదాలవలసల్లో భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో బొండపల్లిలో నిర్వహించిన మహిళాగళంలోనూ మాట్లాడారు. ఆమదాలవలస సభ చివరిలో ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ పాటకు జనంతో కలిసి చంద్రబాబు చేతులు కలిపి స్టెప్పులు వేయడం విశేషం. భవిష్యత్‌ గ్యారంటీ విధానంలో కూడా మహిళలకు ప్రధాన భూమిక ఉండేలా చూస్తానని.. వారిని శక్తిమంతులను చేసి రాష్ట్రాభివృద్ధిలో వారి పాత్ర పెంచుతానని ఆయన తన ప్రసంగాల్లో హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు తీసుకొచ్చింది టీడీపీయేనని గుర్తుచేశారు. మహాశక్తి ద్వారా ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఇస్తాం. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున.. ఐదేళ్లలో రూ.90 వేలు ఇస్తాం. ఆ 90 వేలను రూ.9 లక్షలు చేసే బాధ్యత నాది’ అని చెప్పారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలెండర్లు ఇస్తామని.. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. పింఛన్‌ను రూ.4 వేలకు పెంచి ఏప్రిల్‌ నుంచే ఇస్తానని పునరుద్ఘాటించారు. ఇంకా ఏమన్నారంటే..

మహిళల్లో అంకితభావం..

జనాభాలో సగం ఉన్న అక్క చెల్లెమ్మలకు చట్ట సభల్లో తగిన ప్రాతినిధ్యం ఉండాలి. వారిలో అంకిత భావంతో పనిచేసే తత్వం ఉంటుంది. అందుచేతనే టీడీపీ హయాంలో రేషన్‌ కార్డు మొదలుకొని ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టినా మహిళల పేరుమీదే పంపిణీ చేశాం. ఆస్తి హక్కులో మగవారితో సమానంగా మహిళలకు హక్కులు కల్పించినది ఎన్టీఆర్‌. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశా. ఈ గ్రూపుల సభ్యులను అప్పట్లో గ్రామాల్లో హేళన చేసేవారు. ఇప్పుడు వారు ఆర్థికంగా ఎదిగి బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. వీరిపై నమ్మకంతోనే ఇసుక రీచ్‌లను కూడా అప్పగించాం. వారి ద్వారా మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయించి వారిని ఆర్థికంగా లక్షాధికారులను చేస్తాం. వివాహ వయస్సు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఆడబిడ్డ భారం కాకూడదని భావించి బాలికా సంరక్షణ పథకాన్ని అమలు చేశాం. మళ్లీ ఇటువంటి మెరుగైన పథకాన్ని తీసుకొస్తాం. సంపద కొందరికే పరిమితం కారాదు. టాటా, అదానీ, రిలయన్స్‌ వారే వ్యాపారవేత్తలు కాదు. వ్యాపారంలో మహిళామణులు నిలదొక్కుకునేలా కార్యక్రమాలు తీసుకొస్తాం. మరెన్నో వినూత్న పథకాలు అమలు చేసి, మహిళా శక్తిని ఇనుమడింపజేస్తాం.

స్వేచ్ఛ లేదు..

జగన్‌ ప్రభుత్వంలో మద్యాన్ని డోర్‌ డెలివరీ చేసి ఆడపిల్లల తాళ్లు తెంచుతున్నారు. సైకో పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కోల్పోయారు. జగన్‌ ఊరికో గొడ్డలి ఇచ్చి అరాచకాలు అలవాటు చేస్తున్నాడు. చెల్లెలికి ఆస్తి ఇవ్వకుండా అప్పు ఇచ్చిన వ్యక్తి. ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రను గంజాయి రాజధానిగా చేశాడు. జె బ్రాండ్‌ చీప్‌ లిక్కర్‌ను విక్రయించి మరణాలకు కారణం అవుతున్నాడు. గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా సరఫరా జరుగుతోంది. ఉపాధి ఉద్యోగాలు కల్పించడం లేదు సరికదా.. పిల్లలను మద్యం, మత్తు పదార్థాలకు బానిసలను చేస్తున్నాడు.

బాదుడు లేకుండా చేస్తాం..

ప్రజలపై పన్నుల బాదుడు లేకుండా చేస్తాం. చెత్త పన్ను రద్దుచేస్తాం. ఇంటిపన్నులు నియంత్రిస్తాం. నిత్యావసరాల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించి ఆదుకుంటాం. జలగ జగన్‌.. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పాడు.. చేశాడా..? కానీ మందుబాబులకు ఇప్పుడు మద్యం ధర రూ. 200పైబడి పెంచారు. ఐదేళ్లలో తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచారు. టీడీపీ హయాంలో రూ.200 కరెంటు బిల్లు ఇప్పుడు రూ.వెయ్యి అయింది.

ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలిస్తాం

ఏడాదికి 4 లక్షలు ఉద్యోగాలు.. ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం. మీరు విదేశాలకు పోనక్కర్లేదు. ఇక్కడే కూర్చుని వర్క్‌ ఫ్రం హోం అవకాశం కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం. పెట్టుబడులు తెస్తాం. అధికారంలోకి వచ్చాక తొలిసంతకం డీఎస్సీపైనే. నేను 14 ఏళ్లలో ఎనిమిది సార్లు డీఎస్సీ పెట్టాను. ఉద్యోగాలివ్వడమే నాకు తెలుసు. గంజాయి తేవడం జగన్‌కు తెలుసు. 19 రోజులు ఉంది. అందరూ సైకిలెక్కి టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలు పట్టుకోండి. గాజు గ్లాసులో టీ తాగండి. ఎవరైనా ఎదురొస్తే సైకిల్‌ స్పీడ్‌ పెంచండి. కమలం పువ్వు సైకిల్‌కు పెట్టుకోండి. ఐదేళ్లలో మీరు ఊహించని విధంగా అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా.

మే 1న ఇంటి వద్దే పింఛన్‌ ఇవ్వాలి..

సైకో జగన్‌ను డిమాండ్‌ చేస్తున్నా. మే ఒకటో తేదీన ఇంటివద్దే పింఛన్‌ ఇవ్వాలి. శవరాజకీయాలు చేయొద్దు.. జగన్‌.. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమైనా తెచ్చావా? ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. బస్సుయాత్ర విడిచిపెట్టి ప్రజల్లోకి రా. ఉత్తరాంధ్రకు ఈ ఐదేళ్లలో ఏం చేశావో చెప్పుకోగలవా? మా హయాంలో రూ.2 వేల కోట్లు ఖర్చుచేశాం.

నిజజీవితంలోనూ పవన్‌ హీరోయే..

పవన్‌ కల్యాణ్‌కు.. జగన్‌కూ పోలిక ఉందా? జగన్‌ నెత్తిన రూపాయిపెట్టి వేలం వేస్తే కొనేవాడు కూడా లేడు. ప్రజాజీవితంలో నిజమైన హీరో పవన్‌ . చిరంజీవిని, రాజమౌళిని అవమానించేంతగా జగన్‌కు ఒళ్లంతా కొవ్వుపట్టేసింది. ఈ కొవ్వును కరిగించాల్సిన బాధ్యత ప్రజలదే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం జిల్లావారే.. వీళ్లందరూ వలసలు వెళ్లిపోతున్నారు. ఇక్కడి పిల్లలు మట్టిలో మాణిక్యాలు. మంచి ఇంజనీరింగ్‌ కళాశాలలు, మెడికల్‌ కళాశాలలు, ఐఐటీ కళాశాలలు పెట్టి చదివించుకుంటే ఇక్కడే చదువుకుని జీవితాలు బాగుచేసుకుంటారు. జగన్‌ చేసిన విధ్వంసం చూశారు. రాష్ట్రం నష్టపోయింది. ప్రజలు కూడా వ్యక్తిగతంగా నష్టపోయారు. నాకేం రాజకీయాలు కొత్తకాదు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా. ఇప్పుడు రాష్ట్రం నష్టపోయింది. పాలన గాడి తప్పిపోయింది. నేను సీఎం పదవికోసం రాలేదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఇక్కడి పిల్లల భవిష్యత్‌ బంగారం కావాలి.

ప్రజాస్వామ్యంలో ఉద్యోగులూ భాగస్వాములే. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, పెన్షనర్ల బకాయిలను క్లియర్‌ చేసే బాధ్యత నాది. ఒకటో తారీఖున జీతం, పెన్షన్‌ ఇస్తా. పీఆర్సీని ముందుకు తీసుకెళ్తాం.

జగన్‌ తెచ్చిన రూ.13 లక్షల కోట్ల అప్పు ఎవరు కడతారు? రేపు ఓడిపోతే ఆయన ఉంటాడా? ప్రజలే పన్నుల రూపంలో చెల్లించాలి. ఒక్కో కుటుంబంపై రూ.10 లక్షల అప్పు ఉంది.

- చంద్రబాబు

సీమ నేతలకు బీ-ఫారాలు

శృంగవరపుకోట, ఏప్రిల్‌ 23: విజయనగరం జిల్లా శృంగవరపుకోట రిసార్ట్స్‌లో చంద్రబాబును కొందరు రాయలసీమ టీడీపీ అభ్యర్థులు కలిశారు. ఆయన నుంచి పరిటాల సునీత (రాప్తాడు), పయ్యావుల కేశవ్‌ (ఉరవకొండ), అమరనాథ్‌రెడ్డి (పలమనేరు) బీ ఫారాలు అందుకున్నారు. ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలో బి.ఫారాలు అందించించిన సమయంలో వీరు హజరు కాకపోవడంతో ఇక్కడకు వచ్చి తీసుకున్నట్లు తెలిసింది. కాగా, కుప్పంలో తన నామినేషన్‌ అఫిడవిట్‌కు సంబంధించి చంద్రబాబు మంగళవారమిక్కడ గజపతినగరం జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మున్సిఫ్‌ కోర్టులో ప్రమాణం చేశారు. ఉదయం 11.45 గంటలకు కోర్టుకు చేరుకున్న ఆయన న్యాయాధికారి బి.కనకలక్ష్మి సమక్షంలో ప్రమాణం చేసి ఆ పత్రాన్ని సమర్పించారు.

Updated Date - Apr 24 , 2024 | 03:49 AM