Share News

‘చలో అసెంబ్లీ’పై ఉక్కుపాదం

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:31 AM

గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి విడుదలైన ఆర్థిక సంఘం నిధులను దొడ్డిదారిన మళ్లించిన జగన్‌ సర్కారుపై తాడోపేడో తేల్చుకోవడానికి పార్టీలకతీతంగా సర్పంచ్‌లు ఏకమయ్యారు.

‘చలో అసెంబ్లీ’పై ఉక్కుపాదం

పార్టీలకతీతంగా సర్పంచ్‌ల పోరుబాట

అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేసిన సర్కారు

పోలీసుల కళ్లుగప్పి ముట్టడికి యత్నం

అడ్డుకున్న పోలీసులు..

తోపులాటలో పలువురికి గాయాలు

వ్యాన్లలో కుక్కి స్టేషన్లకు తరలింపు

జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ నిర్బంధాలు

నిధులు, విధులు అపహరించారని

సర్కారుపై సర్పంచ్‌ల ధ్వజం

ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో

రుచి చూపిస్తామని హెచ్చరిక

అమరావతి, ఉయ్యూరు, తుళ్లూరు, ఒంగోలు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి విడుదలైన ఆర్థిక సంఘం నిధులను దొడ్డిదారిన మళ్లించిన జగన్‌ సర్కారుపై తాడోపేడో తేల్చుకోవడానికి పార్టీలకతీతంగా సర్పంచ్‌లు ఏకమయ్యారు. పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలంటూ మంగళవారం సర్పంచ్‌లు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో అన్ని జిల్లాల్లో పోలీసులు ముందుగానే సర్పంచ్‌లను అరెస్ట్‌ చేసి, నిర్బంధించారు. అయినా ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన కొందరు సర్పంచ్‌లు వెలగపూడిలోని అసెంబ్లీ వరకు వచ్చారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని, వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ, ‘వుయ్‌ వాంట్‌ జస్టిస్‌’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘సీఎం డౌన్‌, డౌన్‌’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మహిళా సర్పంచ్‌లు అసెంబ్లీ గేటు ముందు రోడ్డు మీద బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు, సర్పంచ్‌లకు మధ్య తోపులాట జరిగింది. పలువురు సర్పంచ్‌లు కింద పడిపోగా రక్తగాయాలయ్యాయి. తమ ఆవేదన, నిరసన తెలియజేయనివ్వాలని పలువురు సర్పంచ్‌లు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. అయినా వారిని బలవంతంగా అరెస్టు చేసి, వ్యాన్లలో కుక్కి వివిధ స్టేషన్లకు తరలించారు. ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను కృష్ణా జిల్లా ఉయ్యూరులో మంగళవారం గృహనిర్బంధం చేశారు. ప్రకాశం జిల్లాలో 60 మందికిపైగా సర్పంచ్‌లకు సోమవారమే నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో విజయవాడ వెళ్తున్న కొందరిని మార్టూరు సమీపంలోని టోల్‌గేట్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. రాజధానిలోని మందడం రైతుల ధర్నా శిబిరం వద్ద నిరసనకు సిద్ధంగా ఉన్న కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సర్పంచ్‌లను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

సర్పంచుల అరెస్టు దుర్మార్గం: పురందేశ్వరి

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): పల్లె ప్రజల ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన సర్పంచ్‌లను అరెస్టు చేయడం దుర్మార్గమని, జగన్‌ ప్రభుత్వ నియంతృత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేయడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు.

సత్తా చూపుతాం!

అసెంబ్లీ ముట్టడికి ముందు పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ 14, 15 వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి పని చేసే అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎం జగన్‌రెడ్డి మా విధులు, నిధులను అపహరించారు.. సేవ చేస్తామనే భావనతో ఓట్లు వేసి జనం ఎన్నుకున్నారు.. అయితే వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా గుర్తించడంలేదు’ అంటూ వివిధ జిల్లాలకు చెందిన సర్పంచ్‌లు ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు తిరిగి పంచాయతీలకు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మరో రెండు నెలల్లో గ్రామాల్లో తమ సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి రుచిచూపిస్తామని హెచ్చరించారు.

Updated Date - Feb 07 , 2024 | 04:31 AM