అవుతాపురంలో వైఎస్‌ విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2023-03-02T02:43:40+05:30 IST

మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్ద వంగర మండలం అవుతాపురం గ్రామంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు బుధవారం

అవుతాపురంలో వైఎస్‌ విగ్రహం ధ్వంసం

గుర్తు తెలియని దుండగుల ఘాతుకం

ఇది నీచమైన చర్య.. సంస్కారం లేని మంత్రి ఎర్రబెల్లి

వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ధ్వజం

పెద్ద వంగర, హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్ద వంగర మండలం అవుతాపురం గ్రామంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు బుధవారం తెల్లవారుజామున జేసీబీతో ధ్వంసం చేశారు. షర్మిల పాదయాత్ర లో భాగంగా ఫిబ్రవరి 16న అవుతాపురంలో 3800 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా షర్మిల ఆ విగ్రహానికి పూలమాల వేసి తన పాదయాత్రను కొనసాగించారు. అయితే బుధవారం గుర్తు తెలియని దుండగులు వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనను వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా ఖండించారు. వైఎస్సాఆర్‌ విగ్రహాన్ని కూల్చివేయడం నీచమైన చర్య అని, అర్ధరాత్రి బీఆర్‌ఎస్‌ గూండాలు చేసిన పని ఇదన్నారు. మంత్రి దయాకర్‌రావు దగ్గరుండి చేయించిన ఘాతుకమిదన్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా విగ్రహం నిలబడే సరికి ఎర్రబెల్లికి నిద్రపట్టలేదని, అర్ధరాత్రి గూండాలను పెట్టి జేసీబీతో ధ్వంసం చేయించాడని ధ్వజమెత్తారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ములేక విగ్రహాలపై రాజకీయం చేస్తున్నాడన్నారు. ‘‘కనీసం డిగ్రీ కాలేజీ కూడా తెచ్చుకోలేని మంత్రివి నువ్వు! చదువు, సంస్కారం లేని వ్యక్తిని మంత్రిని చేస్తే.. విగ్రహాలను పడగొట్టడంపై ఉన్న సోయి అభివృద్ధి మీద ఎక్కడ ఉంటది?’’ అన్నారు. ఒక్క విగ్రహాన్ని పడగొడితే పాలకుర్తిలో వెయ్యి విగ్రహాలు పెడతామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-03-02T02:43:40+05:30 IST