‘జలగం’కు వచ్చిన అవకాశం మీ బిడ్డకు రాబోతోంది!
ABN , First Publish Date - 2023-11-10T04:36:05+05:30 IST
‘జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం మీ మధిర బిడ్డగా నాకు రాబోతోంది. నాలుగోసారి నన్ను ఆశీర్వదించండి..’ అంటూ సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ప్రజలను కోరారు.
నాలుగోసారి నన్ను ఆశీర్వదించండి: భట్టి విక్రమార్క
మధిర కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
మధిర, నవంబరు 9: ‘జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం మీ మధిర బిడ్డగా నాకు రాబోతోంది. నాలుగోసారి నన్ను ఆశీర్వదించండి..’ అంటూ సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ప్రజలను కోరారు. గురువారం ఖమ్మం జిల్లా మధిరలో భట్టి తన నామినేషన్ దాఖలు సందర్భంగా ఓ గార్డెన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దంచడానికి, దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నెలరోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. ఆ ప్రభుత్వంలో మధిర దశాదిశా నిర్దేశించేందిగా ఉండాలి. అందుకు నన్ను నాలుగోసారి గెలిపించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా. ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. అందుకోసం కాంగ్రెస్ కార్యకర్తలు కంకణబద్ధులై పనిచేయాలి’ అని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మధిర అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.