Women Surgeons : మహిళలే మంచి సర్జన్లు!

ABN , First Publish Date - 2023-09-05T04:00:35+05:30 IST

శస్త్రచికిత్సలు చేయడంలో మగ డాక్టర్ల కంటే మహిళా వైద్యులదే పైచేయి అని.. ఫలితాల్లోనూ పురుష వైద్యుల కన్నా లేడీ డాక్టర్లే మిన్న అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికా, స్వీడన్‌ దేశాల్లో వేర్వేరుగా నిర్వహించిన ఈ అధ్యయనంలో భాగంగా గత దశాబ్ద కాలంలో వివిధ రకాల శస్త్రచికిత్సలు

 Women Surgeons : మహిళలే మంచి సర్జన్లు!

ఫలితాల్లోనూ పురుష డాక్టర్ల కన్నా మిన్న

జామా నెట్‌వర్క్‌లో అధ్యయన నివేదిక

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): శస్త్రచికిత్సలు చేయడంలో మగ డాక్టర్ల కంటే మహిళా వైద్యులదే పైచేయి అని.. ఫలితాల్లోనూ పురుష వైద్యుల కన్నా లేడీ డాక్టర్లే మిన్న అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికా, స్వీడన్‌ దేశాల్లో వేర్వేరుగా నిర్వహించిన ఈ అధ్యయనంలో భాగంగా గత దశాబ్ద కాలంలో వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించుకున్న లక్షలాది మంది సమాచారాన్ని సేకరించి, దాన్ని క్రోడీకరించి వెలువరించిన నివేదిక జామా నెట్‌వర్క్‌ ఓపెన్‌ అనే వైద్య జర్నల్‌లో ప్రచురితమైంది. దాని ప్రకారం.. మహిళా వైద్యులు చేత సర్జరీ చేయించుకున్న వారిలో మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సర్జరీ తర్వాత తిరిగి ఆస్పత్రుల్లో చేరడం, ఇతర సమస్యలేవీ కూడా వారిలో పెద్దగా తలెత్తలేదని గుర్తించారు. అయితే ఇటువంటి అధ్యయనాలు మన దేశంలో సాధ్యం కాదని.. ఎందుకంటే మన దేశంలో రోగుల గణాంకాలు పూర్థిస్థాయిలో అందుబాటులో లేవని ఇక్కడి వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్య విద్య అధ్యాపకులు సైతం.. సర్జరీల విషయంలో ఒకప్పుడు పురుషాధిక్యం ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. గతంలో మహిళా వైద్యులు తమ వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమతూకం చేసుకునేందుకుగాను ఎమర్జెన్సీ బ్రాంచ్‌ తీసుకునే వారుకాదని.. నేత్ర, చర్మ, దంత వైద్య విభాగాలపై ఎక్కువగా ఆసక్తి చూపేవారని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. కానీ గత కొద్దిసంవత్సరాలుగా వైద్య విద్యార్థినులు ఎక్కువగా సర్జరీ బ్రాంచ్‌లలో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారని, ఆర్థోపెడిక్‌, ఫోరెన్సిక్‌ విభాగాల్లోనూ చేరుతున్నారని చెబుతున్నారు.

తెలంగాణలోనూ..

గణాంకాలు చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలోనూ లేడీ డాక్టర్ల హవానే నడుస్తోంది. రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలలకు మహిళా అధ్యాపకులే ప్రిన్సిపల్స్‌గా ఉన్నారు. వైద్య నియామకాల బోర్డు ఇటీవల చేపట్టిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాల్లో 50 శాతం మహిళలే నియమితులయ్యారు. వారం క్రితం ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్‌ రెసిడెంట్లుగా పీజీలను వేయగా.. క్లిష్టమైన జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌, పీడియాట్రిక్‌ సర్జరీ బ్రాంచ్‌లలో మహిళలే ఎక్కువగా వచ్చినట్లు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ చెబుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌కు సమీపంలోని ఓ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో జనరల్‌ సర్జరీలో ఐదు ఎస్‌ఆర్‌ పోస్టులుంటే అంతా లేడీ డాక్టర్లే వచ్చారు. ఆర్థోలోనూ ఐదు పోస్టులకుగాను రెండింట వారే ఉన్నారు. గైనిక్‌ విభాగంలో అయితే మహిళా వైద్యులదే ఆధిపత్యం.


నీట్‌లోనూ అమ్మాయిలదే హవా..

గత ఆరేళ్లుగా దేశవ్యాప్తంగా నీట్‌ రాసే అమ్మాయిల సంఖ్య ఏటికేడాదీ పెరుగుతోంది. 2019లో 8.38 లక్షల మంది అమ్మాయిలు నీట్‌ రాయగా.. 2023 నాటికల్లా ఆ సంఖ్య 11.84 లక్షలకు పెరిగింది. ఏటా నీట్‌ రాసే వారిలో 55-56 శాతం మంది అమ్మాయిలే ఉంటున్నారు. ఆ పరీక్ష పాసయ్యేవారిలోనూ అమ్మాయిలే ఎక్కువగా (ఐదారేళ్లుగా సగటున 56ు) ఉంటున్నారు.

మెడిసిన్‌లో 70% అమ్మాయిలే

గతంతో పోలిస్తే మన దగ్గర కూడా బాగా మార్పు వచ్చింది. మెడిసిన్‌ చేస్తున్న వారిలో 70 శాతం మంది అమ్మాయిలే ఉంటున్నారు. మన దగ్గర ప్రీపారాక్లినిక్‌లో మహిళా అధ్యాపకులదే ఆధిపత్యం. మెడికల్‌లో కూడా 50 శాతం లేడీ డాక్టర్స్‌ ఉన్నారు. నీట్‌లోనూ అమ్మాయిలే ఎక్కువ. ప్రస్తుతం పీజీ సీట్లు కూడా వారికే ఎక్కువగా వస్తున్నా యి. దీంతో పాటు సూపర్‌ స్పెషాలిటీల్లోనూ మెల్లమెల్లగా వారి డామినేషన్‌ పెరుగుతోంది.

- డాక్టర్‌ ఎన్‌.వాణి, ప్రిన్సిపాల్‌, సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల

Updated Date - 2023-09-05T04:00:56+05:30 IST