Share News

వైద్యం వికటించి మహిళ మృతి!

ABN , Publish Date - Dec 20 , 2023 | 11:41 PM

డాక్టర్ల నిర్లక్ష్యం, వైద్యం వికటించడం వల్లే తన భార్య నిర్మల చనిపోయిందంటూ భర్త కుమార్‌, వారి కుటుంబసభ్యులు, బంధువులు శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని సన్‌రైజ్‌ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

వైద్యం వికటించి మహిళ మృతి!
ధ్వంసమైన ఆసుపత్రి అద్దాలు

- శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన

- ఆస్పత్రిపై బంధువుల దాడి.. అద్దాలు ధ్వంసం

శంషాబాద్‌, డిసెంబరు 20: డాక్టర్ల నిర్లక్ష్యం, వైద్యం వికటించడం వల్లే తన భార్య నిర్మల చనిపోయిందంటూ భర్త కుమార్‌, వారి కుటుంబసభ్యులు, బంధువులు శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని సన్‌రైజ్‌ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆస్పత్రి భవనంపై దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు మృతురాలి కుటుంబసభ్యులను అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. స్థానికులు, మృతురాలి కుటుంసభ్యుల కథనం ప్రకారం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం డబిల్‌గూడకు చెందిన నిర్మల(35) గర్భసంచికి సంబంధించిన సమస్యతో మూడు రోజుల క్రితం సన్‌రైజ్‌ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు మంగళవారం ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఐసీయూకు మార్చారు. రెండు రోజులు ఉండాలని చెప్పారు. అయితే, బుధవారం తెల్లవారుజామున నిర్మల ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఐసీయూలోనే చనిపోయింది. నిర్మల ఆరోగ్యం బాగాలేదన్న విషయం డాక్టర్లకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆస్పత్రిపై దాడికి పాల్పడ్డారు. కాగా, నిర్మల కుటుంబానికి సాయం చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇవ్వడంతో బంధువులు నిర్మల మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లారు.

Updated Date - Dec 20 , 2023 | 11:41 PM