లోక్‌సభ ఎన్నికల్లోనూ సీపీఐతోనే
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:46 AM
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరుకోవడం మంచి పరిణామమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ అన్నారు. ఈసారి సోనియా ఎక్కడి నుంచి పోటీ
గాంధీ కుటుంబం పోటీతో తెలంగాణాలో కాంగ్రెస్‌కు మేలు..
జనవరి మొదటి వారంలో తెలంగాణలో పర్యటిస్తా
విధేయతే అర్హతగా అభ్యర్థుల ఎంపిక
కాంగ్రెస్‌ను వీడిన వారిని తిరిగి చేర్చుకోవడంపై ఆలోచించాలి: దీపాదాస్
న్యూఢిల్లీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరుకోవడం మంచి పరిణామమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ అన్నారు. ఈసారి సోనియా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా తెలియదని, అయితే గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా తెలంగాణ నుంచి పోటీ చేస్తే అది పార్టీకి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని, రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కూడా రాష్ట్రంలో కాంగ్రె్‌సను బలోపేతం చేసిందని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రె్‌సలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని విషయాలపైనా తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. జనవరి మొదటి వారంలో తాను తెలంగాణకు వెళతానన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని, గెలువు, విధేయతే అభ్యర్థుల ఎంపికకు ప్రాతిపదిక అని చెప్పారు. ఎమ్మెల్యేలుగా ఓడిన సీనియర్ల సేవలను కూడా పార్టీ, ప్రభుత్వం ఉపయోగించుకునే విషయంపై పార్టీలో చర్చిస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రె్‌సను వీడిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకోవడంపై ఆలోచించాల్సి ఉందన్నారు. ఇతర పార్టీల నుంచి ఎవరు చేరాలన్నది రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ కోసం సుదీర్ఘకాలం కష్టపడి టికెట్ దక్కనివారి ప్రయోజనాలను కూడా పార్టీ పరిరక్షిస్తుందన్నారు. సీపీఐతో లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసి వెళతామని దీపాదాస్ మున్షీ చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం అన్నీ ఒకే తాను ముక్కలని, బీజేపీకి బీఆర్‌ఎస్ బీటీమ్ అన్నది స్పష్టమై పోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం, యువతకు జాబ్ క్యాలెండర్ అమలు చేయడం తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, ఎన్నిరకాల ఇబ్బందులున్నా వాటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కర్ణాటకలో కూడా తాము అధికారంలో ఉన్నందున రెండు రాష్ట్రాలు కలిసి పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. దానివల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.