Share News

బియ్యం ధరలకు రెక్కలు!

ABN , Publish Date - Dec 22 , 2023 | 11:33 PM

బియ్యం ధరలు రోజురోజుకు పెరుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు అధికారంలోకి వస్తే ఉచితంగా అవిస్తాం... ఇదిస్తాం అంటున్నారే తప్పా, మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించ లేకపోతున్నారు. సామాన్య , మధ్యతరగతి ప్రజలు రెండు పూటలా భోజనం చేయలేని పరిస్థితి నెలకొంది. నిత్యావసరాలతో పాటు బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో పేద వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 బియ్యం ధరలకు రెక్కలు!

క్వింటాల్‌ బియ్యానికి రూ. 6000

గతేడాది కంటే రూ.1500 పెరుగుదల

ఇంకా పెరిగే అవకాశముందన్నవ్యాపారులు

పరిగిలో భారీగా బియ్యం అక్రమ నిల్వలు

బియ్యం ధరలు రోజురోజుకు పెరుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు అధికారంలోకి వస్తే ఉచితంగా అవిస్తాం... ఇదిస్తాం అంటున్నారే తప్పా, మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించ లేకపోతున్నారు. సామాన్య , మధ్యతరగతి ప్రజలు రెండు పూటలా భోజనం చేయలేని పరిస్థితి నెలకొంది. నిత్యావసరాలతో పాటు బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో పేద వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పరిగి,డిసెంబరు 22: బియ్యం ధరలు కొండేక్కి చూస్తున్నాయి. మార్కెట్‌లో ఊహించని విధంగా బియ్యం ధరలు పెరగడంతో సామాన్యుడు కడుపు నిండా భోజనం చేయలేని పరిస్థితి నెలకొంది. ఇంటికి వచ్చే బంధువులకు ఒక్కపూట భోజనం పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా సన్న బియ్యం కొనేందుకు మార్కెట్‌కు వెళ్ళిన సామాన్యుడికి బియ్యం ధరలు వింటే కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పటికే అనూహ్యంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు తోడు తాజాగా బియ్యం ధరలు పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొడ్డువి, సన్నవి అని తేడా లేకుండా అన్ని రకాల బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే వరికోతలు కోసి వరిధాన్యం మార్కెట్‌ తరలిస్తున్నారు. కొత్త ధాన్యంను వ్యాపారులు బియ్యంగా మార్చే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇదే తరుణంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. సన్న రకం సోనా బియ్యం క్వింటాలుకు గత ఏడాది రూ.4000 నుంచి రూ.4400వరకు పలకగా, ప్రస్తుతం రూ.5400 నుంచి రూ.6000 పలుకుతున్నాయి. దొడ్డు బియ్యం గతేడాది క్వింటాలు రూ.2800 నుంచి రూ.3200 వరకు పలికేది. ప్రస్తుతం క్వింటాలుకు రూ.3600 నుంచి రూ.4000 వరకు పలుకుతున్నది. మున్ముందు బియ్యం ధరలు ఇంకా పెరగునున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. వడ్లు కొనుగోలు చేసి బియ్యంగా మార్చుకుందామన్నా ధాన్యం క్వింటాల్‌కు రూ. వేయి వరకూ పెరిగిందని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. మార్కెట్‌లో బియ్యం ధరలను నియాంత్రించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం తూతుమంత్రంగా వ్యవహరిస్తోంది. చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటుందే కానీ, మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించలేకపోతుందని విమర్శిస్తున్నారు.

పరిగి, తాండూరులలో భారీగా బియ్యం అక్రమ నిల్వలు

వానాకాంలో సీజన్‌లో ధాన్యం దిగుబడి బాగా తగ్గినపోవడాన్ని ముందే పసిగట్టిన వ్యాపారాలు పరిగి పట్టణంలో భారీ ఎత్తున బియ్యం అక్రమ నిల్వలు చేసినట్లు తెలుస్తోంది. ఈసారి వరి పంట సాగు తగ్గడంలో పాటు వర్షాలకు పంటలు దెబ్బతాన్నియి. దీంతో దిగుబడి బాగా తగ్గిందని స్వయంగా అధికారులు చెబుతున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు బియ్యం నిల్వలపై దృష్టి సారించారు. ఈ మేరకు పరిగి, తాండూరు పట్టణాల్లో వేల టన్నుల్లో బియ్యం అక్రమంగా రహస్య ప్రదేశాల్లో నిల్వ చేసినట్లు సమాచారం. జిల్లాలోని పరిగి ప్రాంతంలో ఎక్కువగా వరి పంటను సాగు చేస్తారు. ఇక్కడే ధాన్యాన్ని బియ్యంగా మార్చి నిల్వలు ఉంచుతున్నట్లు తెలుస్తోంది. బియ్యం నిల్వలపై అధికారుల నియంత్రణ కొరవడడంతో వ్యాపారులకు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారింది. బియ్యం అక్రమ నిల్వలపై అధికారులు నిఘా పెట్టి ధరలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

క్వింటాల్‌కు రూ.1500 పెరిగాయి

గతేడాది ఇదే సమయంలో రూ.4400 క్వింటాలు ఉంటే, ఈ సారి రూ.5500 నుంచి ఆరు వేల వరకు పలుకుతున్నాయి. ధరలు చూస్తే సన్నబియ్యం కోని తినలేని పరిస్థితి ఏర్పడింది. సన్న రకం బియ్యం ధరలపై నియంత్రణ ఉండాలి.

-మనిషా, గృహిణి, పరిగి

వడ్ల ధరలు పెరిగాయి

ధాన్యం ధరలు కూడా పెరిగాయి. గత ఏడాది కంటే వడ్ల ధర క్వింటాల్‌కు రూ.1000వరకు పెరిగింది. సన్నరకం వడ్లు గత ఏడాది రూ.2500 పలికింది. ఈ సారి క్వింటాల్‌కు రూ.3300 వరకు పలుకుతున్నది. దీంతో వడ్లు కొనగోలు చేసి మిల్లులో పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతుంది.

-టి.ప్రదీ్‌పరెడ్డి, రైతు,సుల్తాన్‌పూర్‌

బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉంది

ఈ సారి మార్కెట్‌లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వానాకాంలో సీజన్‌లో కూడా ధాన్యం దిగుబడులు తగ్గాయి. దీంతో సోనా, హంస బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. కొత్త బియ్యం మార్కెట్‌లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. క్వింటాల్‌ సన్నబియ్యం ఏడు వేల వరకూ చేరవచ్చు.

- వేముల కృష్ణమూర్తి, వ్యాపారి, పరిగి

==============================================

Updated Date - Dec 22 , 2023 | 11:34 PM