కాంగ్రెస్‌లో ఈ సారైనా ముందస్తు అభ్యర్థుల ప్రకటన ఉంటుందా?

ABN , First Publish Date - 2023-08-22T04:25:32+05:30 IST

2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్‌ జాబితా ఎప్పుడొస్తుందనే చర్చ మొదలైంది.

కాంగ్రెస్‌లో ఈ సారైనా ముందస్తు అభ్యర్థుల ప్రకటన ఉంటుందా?

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో చర్చ

2018లోనూ నామినేషన్ల వరకూ కొనసాగిన కసరత్తు

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్‌ జాబితా ఎప్పుడొస్తుందనే చర్చ మొదలైంది. మంగళవారం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బరిలోకి దిగి ప్రచారం చేయనున్నారు. వారిని దీటుగా ఎదుర్కొనేందుకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని పలువురు కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు. 2018లో ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌.. నోటిఫికేషన్‌ విడుదలకు చాలా ముందే అభ్యర్థులను ప్రకటించారు. ఆ సమయంలో టీడీపీ, సీపీఐతో జట్టు కట్టిన కాంగ్రెస్‌.. సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికలోనే సమయం అంతా గడిపేసింది.

నామినేషన్ల దాఖలు వరకూ చాలా స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కాలేదు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నెలల తరబడి క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తే, కాంగ్రెస్‌ మాత్రం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలోనే చాలా కాలాన్ని గడిపేసింది. చివరికి ఆ పార్టీకి ప్రచారానికి సమయం సరిపోక.. ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా సెప్టెంబరులోపు అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయకుంటే 2018 ఎన్నికల్లో పడిన ఇబ్బందులనే ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు కాంగ్రెస్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే గతానికి భిన్నంగా నోటిఫికేషన్‌కు చాలా రోజుల ముందే అభ్యర్థిత్వానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కాంగ్రెస్‌ ప్రారంభించింది. 25న ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ దరఖాస్తుల వడపోత చేపట్టేందుకు ఈ నెల 26న పీసీసీ భేటీ కానున్నట్లు సమాచారం. మొదటి వడపోత పూర్తయి బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించాలన్నది తేలి సర్వేల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం 20 నుంచి 30 రోజులు పడుతుందని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ అసంతృప్తులు కాంగ్రెస్‌ గూటికి!

టికెట్లు దక్కని బీఆర్‌ఎస్‌ నేతలు చాలా మంది రానున్న రోజుల్లో కాంగ్రె్‌సలో చేరే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించిన రోజే.. ఆ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అసమ్మతి గళం వినిపించారు. ఈ సారైనా తమకు అవకాశం వస్తుందని పలు నియోజకవర్గాల్లో ద్వితీయ స్థాయి నాయకులు ఎదురు చూశారు. పది చోట్ల మినహా సిట్టింగ్‌లనే అభ్యర్థులుగా ప్రకటించడంతో బీఆర్‌ఎస్‌ ద్వితీయ స్థాయి నాయకుల్లో అసంతృప్తి మొదలైందని బోగట్టా. దీంతో బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలు పెద్దసంఖ్యలో కాంగ్రె్‌సలోకి వలస వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

Updated Date - 2023-08-22T04:25:32+05:30 IST