Share News

భార్య.. భర్త.. ఆమె ప్రియుడు!

ABN , First Publish Date - 2023-10-30T03:49:36+05:30 IST

చంపాపేటలో యువతి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమని దర్యాప్తులో వెల్లడైంది.

భార్య.. భర్త.. ఆమె ప్రియుడు!

వీడిన యువతి హత్య కేసు మిస్టరీ

ప్రియుడితో ఉండడాన్ని చూసి హత్య చేసిన భర్త

హైదరాబాద్‌ సిటీ/సంతో్‌షనగర్‌, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): చంపాపేటలో యువతి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమని దర్యాప్తులో వెల్లడైంది. హతురాలు స్వప్న(21)ది మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ తండా. తల్లిదండ్రులు విడిపోవడంతో హైదరాబాద్‌ వచ్చి ఉంటోంది. ఐఎస్‌ సదన్‌ పరిధిలోని ఎన్‌జీఆర్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఆమెకు మహేశ్వరం ప్రాంతంలోని ఓ తండాకు చెందిన ప్రేమ్‌కుమార్‌తో పెళ్లయింది. అతను ఇటీవల మీర్‌పేట పరిధిలోని ధాతూనగర్‌లో ‘టీ స్టాల్‌’ పెట్టుకున్నాడు. సజావుగా సాగిపోవాల్సిన వారి జీవితంలో స్వప్న మాజీ ప్రియుడు సురేష్‌ అగాధం సృష్టించాడు. అతను ఓ ఆటోడ్రైవర్‌. స్వప్నకు పెళ్లయినా వదల్లేదు. ఈ విషయం గుర్తించి స్వప్నను మందలించినా పట్టించుకోలేదని ప్రేమ్‌ పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి భూక్యా నాయక్‌(స్వప్నకు పరిచయం)ను టీ స్టాల్‌ వద్దకు పిలిచిన ప్రేమ్‌.. స్వప్నను పద్ధతి మార్చుకోమని చెప్పాలని కోరాడు. శనివారం ఇంటికొచ్చి ఆమెతో మాట్లాడతానని భూక్యా నాయక్‌ చెప్పాడు. ఆ రాత్రి ఆలస్యం అవడంతో ప్రేమ్‌ టీ స్టాల్‌లోనే పడుకున్నాడు. శనివారం ఉదయం 10.30 గంటలకు ఇంటికి వెళ్లగా సురే్‌షతో స్వప్న ఏకాంతంగా ఉంది. అది చూసి ప్రేమ్‌ వెంటనే దగ్గర్లోని డీ మార్ట్‌కు వెళ్లి ఓ కత్తి కొనితెచ్చాడు. తలుపుకొట్టి స్వప్నను పిలిచాడు. ఆమె సురే్‌షను పారిపోవాలని చెప్పి తలుపు తీసింది. ఆమెను ప్రేమ్‌ గట్టిగా పట్టుకొని కత్తితో గొంతు కోసి చంపాడు. తర్వాత ప్రేమ్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న సురేష్‌ అతన్ని అడ్డుకొని గొడవపడి కిందకు తోసేశాడు. పెద్ద శబ్దం విన్న ఇంటి యజమాని బయటకొచ్చి చూడగా ప్రేమ్‌ గాయాలతో పడి ఉన్నాడు. సురేష్‌, మరో యువకుడు మెట్లు దిగి కిందకొచ్చి పారిపోవడాన్ని యజమాని గుర్తించాడు. ప్రస్తుతం ప్రేమ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సరుకుల డెలివరీకి వెళ్లి మహిళపై అత్యాచారం

లఖ్‌నవూ, అక్టోబరు29: ఓ ఇంటికి సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ అపార్ట్‌మెం ట్‌లో నివాసముంటున్న ఓ మహిళ మొబైల్‌యాప్‌లో సరుకులను ఆర్డర్‌ చేసింది. ఆ ఆర్డర్‌ను అందుకున్న డెలివరీ ఏజెంట్‌ సుమిత్‌సింగ్‌(23) సరుకులను తీసుకుని, ఆ అడ్రస్‌కు వెళ్లాడు. సరుకులు డెలివరీ చేస్తూ.. ఇంట్లో ఆ మహిళ ఒంటరిగా ఉన్నట్లు గమనించాడు. అదే అదను గా భావించి ఆమెపై అత్యాచారం చేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఆమె పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గాలింపు చేపట్టి సుమిత్‌ను పట్టుకున్నారు. ఆ సమయంలో ఓ కానిస్టేబుల్‌ వద్ద నుంచి గన్‌ లాక్కొని పరారయ్యేందుకు యత్నించాడు. పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు సుమిత్‌ కాలుపై కాల్చి, అరెస్టు చేశారు. అనంతరం అతణ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా అక్రమంగా మద్యం అమ్మిన కేసులో పోలీసులు సుమిత్‌ను గతంలోనే ఓసారి అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2023-10-30T03:49:36+05:30 IST