మేడిగడ్డ, అన్నారం ఎందుకు మునిగాయి?

ABN , First Publish Date - 2023-06-01T03:31:47+05:30 IST

సిరిపురం (అన్నారం) పంప్‌హౌ్‌సలు ఎందుకు మునిగాయి? అందుకు కారణమేంటి? నిర్మాణ లోపాలా? లేక అధికారుల తప్పిదాలా? పునరుద్ధరణకు ఎంత ఖర్చయింది?

మేడిగడ్డ, అన్నారం ఎందుకు మునిగాయి?

నిర్మాణ లోపాలా? అధికారుల తప్పిదాలా?

పునరుద్ధరణకు ఎంత ఖర్చయింది?.. కాళేశ్వరంపై కాగ్‌ జల్లెడ

అంచనా వ్యయంతో పాటు అదనపు టీఎంసీపై ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి): ‘‘కన్నెపల్లి (మేడిగడ్డ), సిరిపురం (అన్నారం) పంప్‌హౌ్‌సలు ఎందుకు మునిగాయి? అందుకు కారణమేంటి? నిర్మాణ లోపాలా? లేక అధికారుల తప్పిదాలా? పునరుద్ధరణకు ఎంత ఖర్చయింది? ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటిదాకా చేసిన పనులు, అందుకైన వ్యయం ఎంత? ప్యాకేజీల వారీగా నిర్మాణానికి ఎంత వ్యయంతో అనుమతులిచ్చారు? తర్వాత ఎంతకు పెంచారు?’’ అంటూ కాళేశ్వరం ఎత్తిపోతలపై కంప్రోల్టర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఎత్తిపోతల మోటార్లకు ఎంత వెచ్చించారు? ఏ కంపెనీ నుంచి కొన్నారు? ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు? పరికరాలకు ఎంత ఖర్చయింది? వంటి వివరాలను నిశితంగా ఆరా తీసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆడిట్‌ చేసే ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ఎత్తిపోతలను ఒకటిగా కాగ్‌ తీసుకుంది. ఏడాదిన్నర నుంచి ప్రాజెక్టును అన్ని కోణాల్లో జల్లెడ పడుతోంది. అంచనా వ్యయంతో పాటు అదనపు టీఎంసీ కాంపోనెంట్‌, నిర్మాణ పనులపై పది రోజులుగా అధికారులను ప్రశ్నలతో ముంచెత్తుతోంది. బుధవారం హైదరాబాద్‌లోని అకౌంటెంట్‌ జనరల్‌ (ఏజీ) కార్యాలయంలో కాళేశ్వరంపై సమావేశం జరిగింది. నీటి పారుదల శాఖ అధికారులు సమర్పించిన వివరాలపై అనుమానాల నివృత్తి కోసం ఈ సమావేశం నిర్వహించారు.

ఇందులో కాగ్‌ ప్రశ్నలకు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజతకుమార్‌ వివరాలు అందించారు. అదనపు టీఎంసీకి చేేస ఖర్చు, ఆ పనుల వివరాలు, 2 టీఎంసీలకు మించి అదనపు టీఎంసీతో ఖర్చు-ప్రయోజనం నిష్పత్తి (కాస్ట్‌- బెనిఫిట్‌ రేషియో) ఎంత? ప్రాజెక్టుకు వచ్చిన అనుమతులు, ప్రాణహిత- చేవెళ్ల నుంచి కాళేశ్వరంగా రీ డిజైన్‌ చేయడానికి దారితీసిన పరిస్థితులు, సంబంధిత డాక్యుమెంట్లను అధికారుల నుంచి కాగ్‌ సేకరించింది. ప్రాణహిత-చేవెళ్లను రీ ఇంజనీరింగ్‌ ద్వారా కాళేశ్వరంగా మార్చుతూ కేబినెట్‌ సబ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన మినిట్స్‌, హైపవర్‌ కమిటీ నివేదికను తీసుకుంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 దాకా ప్రాజెక్టుకు బడ్జెట్‌ కేటాయింపులు/వ్యయం, శాఖలవారీగా జారీ అయిన అనుమతులు, పర్యావరణ ప్రభావ నివేదిక, పర్యావరణ యాజమన్య ప్రణాళిక, వాటిని పొందేందుకు ఏర్పాటు చేసిన ఏజెన్సీ, దానితో చేసుకున్న ఒప్పందం, ఆ ఏజెన్సీ సమర్పించిన నివేదికను కూడా సేకరించింది. కాగా, 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌పై ఎన్‌జీఆర్‌ఐ సర్వే రిపోర్టు, గోదావరిలో 75 శాతం డిపెండబులిటీ ద్వారా నికర జలాల లభ్యత, రిజర్వాయర్లతో ఫిషరీస్‌ ద్వారా ఆదాయం పెరుగుతుందన్న ప్రతిపాదనలకు సంబంధించిన నివేదిక, ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్తు తదితర వివరాలను కాగ్‌ అధికారులు తెలుసుకున్నారు.

పంప్‌హౌ్‌సలను పునరుద్ధరించాం

మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌ్‌సలు గతేడాది జూలైలో భారీ వరదతో ముంపునకు గురయ్యాయి. ఈ పంపులన్నీ డిఫెక్ట్‌ లయబులిటీ (లోపానికి బాధ్యత)లో ఉన్నాయి. వాటిని నిర్మాణ సంస్థ సొంత ఖర్చుతో పునరుద్ధరించింది. దీనికి ప్రభుత్వం నుంచి పైసా కూడా వెచ్చించలేదు. కాళేశ్వరం ఎత్తిపోతలు ప్రపంచంలో అతి పెద్దది. రికార్డు సమయంలో పూర్తిచేశాం. ప్రాజెక్టు నిర్మాణం అంతా నిబంధనల ప్రకారమే జరిగింది. తక్కువ కాలంలో నిర్మించిందున అంచనా వ్యయం కూడా పెరగలేదు.

- కాగ్‌ సమావేశంలో నీటిపారుదల శాఖ

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజతకుమార్‌

Updated Date - 2023-06-01T03:31:47+05:30 IST