Share News

katipally venkataramana reddy: ఎవరీ.. కాటిపల్లి?. కేసీఆర్, రేవంత్‌ని ఎలా ఓడించారు

ABN , First Publish Date - 2023-12-04T05:22:15+05:30 IST

కాటిపల్లి వెంకటరమణారెడ్డి.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం తర్వాత రాజకీయ వర్గాల్లో మార్మోగుతున్న పేరు.

katipally venkataramana reddy: ఎవరీ.. కాటిపల్లి?. కేసీఆర్, రేవంత్‌ని ఎలా ఓడించారు

కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిని ఓడించిన బీజేపీ అభ్యర్థి కే వెంకటరమణారెడ్డి

కేసీఆర్‌పై 6,741 ఓట్లతో గెలుపు

స్థానికత, సొంత మేనిఫెస్టోతో సంచలనం

కామారెడ్డి ఓటర్ల సంచలన తీర్పు

కామారెడ్డి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాటిపల్లి వెంకటరమణారెడ్డి.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం తర్వాత రాజకీయ వర్గాల్లో మార్మోగుతున్న పేరు. నిన్నటిదాకా కామారెడ్డి జిల్లా నేతగానే ఉన్న వెంకటరమణారెడ్డి ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సంచలనం అయిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, సీఎం అభ్యర్థి, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రత్యర్థులుగా పోటీ పడిన కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి విజయం సాధించడమే ఇందుకు కారణం. బీజేపీ అభ్యర్థి అయిన వెంకటరమణా రెడ్డి తన సమీప అభ్యర్థి కేసీఆర్‌పై 6,741 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 66,652 ఓట్లతో కాటిపల్లి విజయం సాధించగా.. కేసీఆర్‌ 59,911 ఓట్లు, రేవంత్‌రెడ్డి 54,916 ఓట్లుతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచి ఓడిపోయారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ 1257 ఓట్లు బీజేపీకే రావడం విశేషం. నిజానికి, కేసీఆర్‌, రేవంత్‌ పోటీ చేస్తుండంతో ప్రారంభం నుంచి కామారెడ్డి పై రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఉంది. వీరిద్దరూ సీఎం అభ్యర్థులు కావడంతో ఎవరు గెలుస్తారు ? అనే చర్చ విస్త్రతంగా జరిగింది. ఓట్ల లెక్కింపులో పదో రౌండ్‌ వరకు రేవంత్‌ ఆధిక్యం కొనసాగినా... 11వ రౌండ్‌ నుంచి కాంగ్రెస్‌, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరిగింది. కానీ, ఆఖరి, 19వ రౌండ్‌ వరకు బీజేపీ ఆధిక్యం కొనసాగింది. కేసీఆర్‌, రేవంత్‌కు కాకుండా ఓటర్లు స్థానికుడైన కాటిపల్లికి పట్టం కట్టిన ఓటర్లు సంచలన తీర్పు ఇవ్వడం విశేషం.

కలిసొచ్చిన స్థానికత, సొంత మేనిఫెస్టో..

2018 ఎన్నికల్లో కామారెడ్డి నుంచే బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకటరమణారెడ్డికి 15,439 ఓట్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారని ఇతర ప్రాంతాల ప్రజలు ఎవరూ ఊహించలేదు. కానీ, స్థానికత అంశం ఆయనకు మేలు చేసింది. కేసీఆర్‌, రేవంత్‌ ఎవరు గెలిచినా నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని ప్రజలకు తెలుసు. ఇదే అంశాన్ని కాటిపల్లి ప్రజల్లోకి తీసుకెళ్లారు. తానైతే లోకల్‌ అని ప్రజలకు వివరించారు. దీనికి తోడు ప్రధాని మోదీ బహిరంగ సభ కూడా ఉపయోగపడింది. రైతుల సమస్యలు, డ్వాక్రా మహిళల రుణాల మంజూరు, అధికార పక్షనేతల భూ కబ్జాలపై కాటిపల్లి పోరాటాలు చేశారు. వీటితో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. తాను గెలిచినా, లేకున్నా రూ.150 కోట్ల సొంత నిధులతో పలు అభివృద్ధి పనులు చేస్తానని కాటిపల్లి సొంత మేనిఫెస్టోను ప్రకటించారు. అన్ని మండల కేంద్రాల్లో మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు కట్టిస్తానని, మోడల్‌ స్కూళ్లు నిర్మిస్తానని, రైతు సేవ కేంద్రాలు, యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ కలిసి కాటిపల్లికి సంచలన విజయం తెచ్చిపెట్టాయి.

జడ్పీ చైర్మన్‌ నుంచి ఎమ్మెల్యేగా..

కామారెడ్డిలో నివాసముండే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విద్యా సంస్థల నిర్వహణతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోనూ ఉన్నారు. ఈయనకు భార్య విజయ, కుమారుడు మైత్రేయ ఉన్నారు. 2006లో కాంగ్రెస్‌ తరఫున తాడ్వాయి జడ్పీటీసీగా గెలుపొందారు. అప్పటి సీఎం వైఎస్‌ అండతో 2008-11 వరకు ఉమ్మడి నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌గా చేశారు. వైఎస్‌ మరణం అనంతరం వైసీపీలో చేరి నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేశారు. తిరిగి కాంగ్రె్‌సలో చేరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉండి చివర్లో తప్పుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. కాగా, వెంకటరమణారెడ్డి జెయింట్‌ కిల్లర్‌ అని ఇంత గొప్ప విజయం సాధించినందుకు అభినందనలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు.

కేసీఆర్‌ను సీఎంగా భావించలేదు...

కామారెడ్డిలో కేసీఆర్‌ను నేను ముఖ్యమంత్రిగా చూడలేదు. కేసీఆర్‌, రేవంత్‌ నాతో పోటీపడుతున్న సాధారణ అభ్యర్థులుగానే భావించా. ప్రజలకు కూడా ఇదే విషయం చెప్పా. నాకు మద్దతుగా నిలిచిన ప్రజలు నన్ను గెలిపించారు. బీజేపీ కార్యకర్తల కాళ్లు మొక్కినా సరే వారి రుణం తీర్చుకోలేను. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా.

- కాటిపల్లి వెంకట రమణారెడ్డి

Updated Date - 2023-12-04T08:57:00+05:30 IST