రిజిస్ట్రేషన్ల శాఖలో ఎక్కడి వారక్కడే!
ABN , First Publish Date - 2023-06-26T03:34:25+05:30 IST
రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో అధికారులు, సిబ్బంది బదిలీలను ప్రభుత్వం అటకెక్కించింది. అటెండర్ల నుంచి జిల్లా రిజిస్ట్రార్ల వరకు ఏళ్ల తరబడి ఒకే చోట పని చేస్తున్నారు....
10 ఏళ్లుగా బదిలీల్లేవు.. కొన్ని చోట్ల 13 ఏళ్లుగా ఒకే సబ్ రిజిస్ర్టార్
బదిలీలు చేపట్టాలన్న అర్జీలు బుట్టదాఖలు.. ఉద్యోగుల ఎదురు చూపులు
ఒకే చోట పని చేస్తుండడంతో క్షేత్ర స్థాయిలో బీఆర్‌ఎస్ నేతల నుంచి ఒత్తిళ్లు
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి):రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో అధికారులు, సిబ్బంది బదిలీలను ప్రభుత్వం అటకెక్కించింది. అటెండర్ల నుంచి జిల్లా రిజిస్ట్రార్ల వరకు ఏళ్ల తరబడి ఒకే చోట పని చేస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్, జిల్లా కార్యాలయాల్లో కొందరు అధికారులు సిబ్బంది 13 ఏళ్లకుపైగా ఒకే చోట పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సుదీర్ఘకాలం పాటు ఒకే చోట పనిచేస్తున్న తమను బదిలీ చేయాలంటూ కొందరు సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు అర్జీలు పెట్టుకున్నా అవి బుట్టదాఖలయ్యాయి. చాలా కాలంగా ఒకే చోట పనిచేస్తుండడంతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలంటూ అధికార పార్టీ నేతలనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. మరో రెండు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కొత్తగాఏర్పాటు చేశారు. వీటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో సబ్‌రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్ల బదిలీలు జరిగాయి. ఆ తర్వాత మియాపూర్ భూ కుంభకోణం నేపథ్యంలో పాత 6వ జోన్ పరిధిలోని కొంతమంది సబ్‌రిస్ట్రార్లను 2017లో బదిలీ చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ శాఖను సర్కారు పట్టించుకోలేదు. దీంతో దాదాపు 40మందికి పైగా సబ్‌రిజిస్ట్రార్లు ఎనిమిదేళ్లనుంచి ఒకే చోట పనిచేస్తున్నారు. ఇక దిగువస్థాయి సిబ్బంది 11 సంవత్సరాలకు పైగా అదే కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ములుగు సబ్ రిజిస్ట్రార్ 13 ఏళ్లుగా, వరంగల్ ఫోర్ట్ సబ్‌రిజిస్ట్రార్ 11 ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నలుగురు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు పదేళ్లనుంచి ఒకే చోట పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదుగురు సబ్‌రిజిస్ట్రార్లు 6 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్నారు. పూర్వ 6 జోన్ పరిధిలోకి వచ్చే హైదరాబా ద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోనూ 6నుంచి పదేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. ఇక, జిల్లా రిజిస్ట్రార్ల విషయానికి వస్తే2017నుంచి బదిలీలు జరగలేదు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు లేక చాలా జిల్లాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఒకసారి ఇద్దరు జిల్లా రిజిస్ట్రార్లకు డీఐజీ(డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్)గా పదోన్నతు లు ఇవ్వడం మినహా ఎలాంటి బదిలీలు చేపట్టలేదు. చాలాకాలంగా ఒకే చోట పనిచేస్తున్నామని, తమను బదిలీ చేయాలని కొందరు ఉద్యోగులు అర్జీలు పెట్టుకున్నా ఫలితం మాత్రం ఉండటంలేదు.
నిబంధనలకు విరుద్ధంగా..
సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు, క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయాలంటూ అధికారపార్టీ నేతలు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ తతంగం ఎక్కువగా సాగుతోంది. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక గతంలో కొందరు సబ్‌రిజిస్ట్రార్లు సెలవులో వెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రిజస్ట్రేషన్, స్టాంపుల శాఖలో బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.