మా వడ్లు ఇంకెప్పుడు కొంటారు!

ABN , First Publish Date - 2023-06-01T03:42:20+05:30 IST

రాష్ట్రంలో అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు తీరడం లేదు.

మా వడ్లు ఇంకెప్పుడు కొంటారు!

కొనసాగుతున్న రైతుల ఆందోళనలు..

తూకం వేసినా తరలించడం లేదంటూ నిరసనలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు తీరడం లేదు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి 2 నెలలు కావస్తున్నా ఇంకా కొన్ని చోట్ల జాప్యం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం, అధికారుల తీరును నిరసిస్తూ రైతన్నలు పలుచోట్ల రోడ్డెక్కుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం కాల్వ గ్రామ రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ధర్మారంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. కొనుగోళ్ల జాప్యంతో మిల్లర్లు ఏదో వంక పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇటు భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని పరకాల-భూపాలపల్లి రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై వడ్లు దహనం చేసి నిరసన తెలిపారు. అలాగే తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం లేదని మరికొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. మెదక్‌ జిల్లాలోని రామాయంపేట, కౌడిపల్లి, శివ్వంపేట మండలాల్లో రైతులు నిరసనలు చేపట్టారు. ఇటు మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల కొనుగోలు కేంద్రం వద్ద ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలు రోడ్డుపై వేసి రైతులు రాస్తారోకో నిర్వహించారు.

B

మొక్కజొన్న రైతులకు కూడా కష్టాలు తప్పట్లేదు. మక్కల కొనుగోళ్ల జాప్యంపై ఆగ్రహించిన రైతులు ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతల వేబ్రిడ్జి ఎదురుగా ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. కాంటాలు వేసిన మక్కల బస్తాల లోడ్‌ ట్రాక్టర్లను అడ్డుపెట్టి రాస్తారోకో చేశారు. చింతకాని, కొణిజర్ల మండలాలకు చెందిన కొందరు రైతులు అక్కడ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసిన తమ మొక్కజొన్న బస్తాలను బోనకల్‌ మండలం చిరునోములలోని గోదాంలో వేసేందుకు మార్క్‌ఫెడ్‌ అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలతో వచ్చారు. అయితే అక్కడ ఖాళీ లేకపోవడంతో దించలేదు. దీంతో రైతులు నిరసనకు దిగారు.

Updated Date - 2023-06-01T03:42:20+05:30 IST