Share News

రోడ్లకు మరమ్మతులెప్పుడు?

ABN , Publish Date - Dec 30 , 2023 | 03:03 AM

రాష్ట్రంలో ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ శాఖ రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది.

రోడ్లకు మరమ్మతులెప్పుడు?

మంజూరైన పనుల్లో నత్తనడకే.. 1,171 పనుల్లో 503 మాత్రమే పూర్తి

టెండరు దశలోనే 143 పనులు.. కాంట్రాక్టర్లకు రూ.630కోట్ల బకాయిలు

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ శాఖ రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. రెండేళ్లలో రహదారుల మరమ్మతులకు సంబంధించి పనులు సరిగా సాగకపోవడంతో రోడ్లు గుంతలమయంగా తయారై ప్రమాదకరంగా మారాయి. గత జూలైలో కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,320 కిలోమీటర్ల మేర రహదారులు, పలుచోట్ల బ్రిడ్జిలు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. ఇవీకాక రాష్ట్రంలో రూ.2,888.34 కోట్లతో 1,171 ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేయాల్సి ఉంది. వీటిపై అప్పటి సీఎం కేసీఆర్‌ సమీక్షతో ఆర్‌ అండ్‌ బీ శాఖ అప్రమత్తమై నిధులు కూడా మంజూరు చేసింది. అయితే క్షేత్రస్థాయిలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. 1,171 పనుల్లో రూ.1,058.32 కోట్లతో 503 పనులే పూర్తయ్యాయి. 266 పనులు పురోగతిలో ఉన్నాయి. మరో 259 పనులు టెండర్ల ప్రక్రియను పూర్తిచేసుకుని ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక రూ.1,058.32 కోట్ల పనుల్లో పూర్తిచేసిన 503 పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.630 కోట్లకు పైగా బిల్లులను క్లియర్‌ చేయాల్సి ఉన్నట్లు సమాచారం.

జూలైలో ధ్వంసమైన రోడ్లకు సంబంధించి మరమ్మతులకు రూ.700 కోట్లకుపైగా నిధులు అవసరపడతాయని ప్రభుత్వానికి గతంలోనే ఆర్‌ అండ్‌బీ శాఖ నివేదికను ఇచ్చింది. ఇందులో భాగంగా తాత్కాలిక రిపేర్లకు రూ.46కోట్లు, పూర్తిస్థాయి నిర్మాణాలకు రూ.474కోట్లు, కాగా కల్వర్టులు, బ్రిడ్జిల పనుల కోసం రూ.200 కోట్లు కావాలని గత ప్రభుత్వానికిచ్చిన నివేదికలో అధికారులు పొందుపర్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో అవసరమైన చోట మరికొన్ని మేజర్‌ కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణాలను కూడా చేపట్టాలంటే వాటికి దాదాపు రూ.885కోట్లు అదనంగా నిధులు కావాల్సి ఉంటుందని కూడా అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. కాగా బిల్లుల క్లియరెన్స్‌కు సంబంధించి కాంట్రాక్టర్లు ఇటీవల ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి మాట్లాడిన ట్లు సమాచారం. త్వరలోనే రోడ్ల మరమ్మతులు, పెండింగ్‌ బకాయిలకు సంబంధించి ఒక స్పష్టతనిచ్చి, కాంట్రాక్టర్ల సమస్యలకు కూడా ఒక పరిష్కారం చూపుతామని వారికి మంత్రి హామీనిచ్చినట్టు తెలిసింది.

Updated Date - Dec 30 , 2023 | 03:03 AM