Share News

టూరిజం కార్పొరేషన్‌ ఎండీ సస్పెన్షన్‌పై ఏం తేల్చారు?

ABN , Publish Date - Dec 30 , 2023 | 03:07 AM

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎలక్షన్‌ కమిషన్‌ సస్పెండ్‌ చేసిన టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ బోయిన్‌పల్లి మనోహర్‌రావు విషయమై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించింది.

టూరిజం కార్పొరేషన్‌ ఎండీ సస్పెన్షన్‌పై ఏం తేల్చారు?

ఇంత ఆలస్యం ఎందుకు?

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు

ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిక

హైదరాబాద్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎలక్షన్‌ కమిషన్‌ సస్పెండ్‌ చేసిన టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ బోయిన్‌పల్లి మనోహర్‌రావు విషయమై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించింది. సస్పెన్షన్‌ ఎత్తివేయాలా? కొనసాగించాలా? అనే నిర్ణయం తీసుకోవడానికి ఇంత జాప్యం ఎందుకని ప్రశ్నించింది. వారంలో నిర్ణయం తీసుకోకపోతే సంబంధితశాఖ ముఖ్యకార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చామని పేర్కొంది. సంబంధిత శాఖ ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడంతోపాటు వచ్చే వాయుదా రోజు మెరిట్స్‌ ఆధారంగా విచారణ చేపట్టి తామే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌రావు అప్పటి మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌తో తిరుమల వెళ్లారని ఆరోపణలు రావడంతో సస్పెన్షన్‌ వేటు పడింది. సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు జారీచేసే అధికారం ఈసీకి లేదని, తాను అధికారిక పర్యటనపై తిరుమల వెళ్లానని, మంత్రికి ఎటువంటి ప్రోటోకాల్‌ ఇవ్వలేదని పేర్కొంటూ మనోహర్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ శుక్రవారం మరోసారి హైకోర్టు ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పి. శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ ఇదే తరహాలో ఈసీ సస్పెన్షన్‌కు గురైన అప్పటి డీజీపీ అంజనీకుమార్‌ వ్యవహారంలో తక్షణం నిర్ణయం తీసుకుని సస్పెన్షన్‌ ఎత్తేశారని, కానీ ఈ విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచన అందలేదని మరో రెండువారాలు సమయం ఇవ్వాలని కోరారు. దాంతో తదుపరి విచారణ జనవరి 8కి వాయిదా పడింది.

Updated Date - Dec 30 , 2023 | 03:07 AM