తెలుగులో ప్రశ్నపత్రం ఏది ‘గురూ’!

ABN , First Publish Date - 2023-08-02T04:23:54+05:30 IST

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయదల్చిన 9,210 పోస్టుల భర్తీలో భాగంగా మంగళవారం నిర్వహించిన ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ పరీక్షల్లో తీవ్ర గందరగోళం జరిగింది.

తెలుగులో ప్రశ్నపత్రం ఏది ‘గురూ’!

ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ పరీక్ష ఇంగ్లీషులోనే..

గురుకుల పోస్టుల పరీక్షలో గందరగోళం

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయదల్చిన 9,210 పోస్టుల భర్తీలో భాగంగా మంగళవారం నిర్వహించిన ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ పరీక్షల్లో తీవ్ర గందరగోళం జరిగింది. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో రావాల్సిన ప్రశ్నపత్రం కేవలం ఇంగ్లిషు లోనే వచ్చింది. ఫలితంగా తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. మూడు పేపర్లుగా ఉన్న పరీక్షల్లో పేపర్‌-1ను తెలుగు, ఇంగ్లిషులో అందిస్తా మని, పేపర్‌-2, 3లకు మాత్రం ఇంగ్లిషు ప్రశ్నపత్రం ఇస్తామని బోర్డు ఆయా పోస్టుల నోటిఫికేషన్లలో స్పష్టంగా పొందుపరిచింది. అయితే ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ పరీక్షల కోసం ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిషులోనే ఇచ్చారని, ఫలితంగా తాము పరీక్షను పూర్తిస్థాయిలో రాయలేకపోయామని తెలుగు మీడియం అభ్యర్థుల్లో చాలా మంది వాపోతున్నారు. ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ పరీక్షలకు పదో తరగతి, ఇంటర్మీడి యట్‌తో పాటు, సంబంధిత కోర్సులో డిప్లొమా చేసిన వారు అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

వీరిలో ఎక్కువ మంది తెలుగుమీడియం విద్యార్థులే ఉన్నారని, అలాంటిది తెలుగులో ఇవ్వకుండా ఇంగ్లిషులోనే ఇవ్వడం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై పరీక్ష కేంద్రంలోని పరీశీలకులను అభ్యర్ధులు అడగ్గా సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారని హన్మకొండ జిల్లాకు చెందిన ఆర్ట్‌ పరీక్ష రాసిన ఓ అభ్యర్ధి ‘ఆంధ్రజ్యోతి’తో పేర్కొన్నారు. తెలుగు మీడియంలో పరీక్షకు సిద్ధమైతే.. ప్రశ్నపత్రం మాత్రం ఇంగ్లిషులో ఇచ్చారని వనపర్తి జిల్లా, వనపర్తి టౌన్‌కు చెందిన క్రాఫ్ట్‌ పరీక్ష రాసిన ఓ మహిళా అభ్యర్థిఽ చెప్పారు. ప్రభుత్వం దీనిపై స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. కాగా మొదటి రోజు 1470 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షకు 10,920 మంది హాజరుకావాల్సి ఉండగా, 9,450 మంది అభ్యర్ధులు మాత్రమే హాజరయ్యారు. మంగళవారం నిర్వహించిన పరీక్ష సజావుగా సాగిందని గురుకుల బోర్డు కన్వీనర్‌ డాక్టర్‌ మల్లయ్య బట్టు ఓ ప్రకటనలో తెలిపారు. రేపటి నుంచి ఇతర పోస్టుల పరీక్షలు ఉంటాయని, అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - 2023-08-02T04:23:54+05:30 IST