KTR: గవర్నర్లతో ఉపయోగమేంటి?
ABN , First Publish Date - 2023-01-31T03:06:36+05:30 IST
బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన గవర్నర్ వ్యవస్థ వల్ల ఉపయోగమేంటని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. పీఎం, సీఎంలను ప్రజలు ఎన్నుకున్నారని, గవర్నర్లను ఎవరు ఎన్నుకున్నారని ప్రశ్నించారు.
ఆ వ్యవస్థతో దేశానికి ప్రయోజనమేంటి?..
అది బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టినదేగా?
బానిస పోకడలు పోవాలన్న ప్రధాని మోదీ..
ఈ వ్యవస్థను రద్దు చేస్తారా..?
రాజ్యాంగ పదవుల్ని గౌరవిస్తాం..
వారూ హుందాగా ఉండాలి
రాజ్‌భవన్‌ను ‘రాజకీయ కేంద్రం’గా మార్చొద్దు: మంత్రి కేటీఆర్
గల్లీల్లో కాదు.. ఢిల్లీలో నిలదీయండి.. బీజేపీ ఎంపీలకు హితవు
ప్రాజెక్టులకు నిధులివ్వండి.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ
సిరిసిల్ల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన గవర్నర్ వ్యవస్థ వల్ల ఉపయోగమేంటని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. పీఎం, సీఎంలను ప్రజలు ఎన్నుకున్నారని, గవర్నర్లను ఎవరు ఎన్నుకున్నారని ప్రశ్నించారు. బ్రిటిష్ కాలం నాటి బానిస పోకడలు, చిహ్నాలు పోవాలని చెప్పే ప్రధాని మోదీ.. బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన గవర్నర్ వ్యవస్థను కూడా రద్దు చేస్తారా? అని నిలదీశారు. రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్‌గా మార్చామని మోదీ గొప్పగా ఉపన్యాసం ఇచ్చారని కేటీఆర్ అన్నారు. గవర్నర్ వ్యవస్థ వల్ల ఎవరికి ఉపయోగమని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్నవారు రెండేళ్లు ఖాళీగా ఉంటేనే గవర్నర్ పదవులు ఇవ్వాలన్న సంప్రదాయాన్ని మోదీ పాటిస్తున్నారా అని నిలదీశారు. సోమవారం సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో గవర్నర్లను బానిసత్వానికి చిహ్నాలుగా అభివర్ణించిన మోదీ.. దానిపై స్పందించాలన్నారు. గవర్నర్ పదవికి బ్రిటిష్ కాలంలో ఒక అర్థం ఉండేదని.. వైస్రాయ్, గవర్నర్ల మధ్య సంభాషణలు జరిగేవని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు ప్రధాని పేరును వైస్రాయ్‌గా మార్చుకోవాలా? లేక గవర్నర్ వ్యవస్థను ఎత్తివేయాలా? అన్నది ఆలోచించుకోవాలని చెప్పారు.
గవర్నర్లను రాజకీయాల్లో పావులుగా వాడుకునే ముందు ఆలోచించాలన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించే సంస్కృతి తమకు ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు కూడా పార్టీలకు అనుకూలంగా, ప్రతినిధులుగా, పార్టీల తరఫున చర్చల్లో పాల్గొనడం.. రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిదని సూచించారు. ఒక పార్టీ గురించి మాట్లాడడం, పార్టీ నాయకుల ఫొటోలు రాజ్‌భవన్‌లో పెట్టుకోవడం, రాజ్‌భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం దేశానికి మంచిది కాదని కేటీఆర్ అన్నారు.
గల్లీల్లో మాట్లాడడం కాదు..
‘బీజేపీ ఎంపీల్లారా.. తెలంగాణ గల్లీల్లో తిరుగుతూ సిల్లీగా మాట్లాడడం కాదు. ఢిల్లీకి వెళ్లి ఎంపీలుగా చేయాల్సిన పని చేయాలి. మిమ్మల్ని గెలిపించిన ప్రజలు రైల్వే లైన్లపై నిలదీయకముందే సిగ్గు తెచ్చుకొని స్పందించండి. చేతనైతే ఢిల్లీలో గల్లా పట్టుకుని నిలదీయండి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కొత్త రైళ్లు, ప్రాజెక్టులు లేవని, పాతవి పూర్తి చేయడం లేదని విమర్శించారు. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రం తీరును నిలదీస్తారన్నారు. తెలంగాణ బిడ్డలైతే, చీము, నెత్తురు ఉంటే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు వారితో కలిసి గొంతు విప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్నో రకాల హామీలు, వాగ్దానాలు చేశారని.. ఒక్కటీ నెరవేర్చలేదని చెప్పారు. మోదీ హయాంలో ఇదే చివరి బడ్జెట్ అన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని తెలంగాణకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేర్చాలని చెప్పారు. ఎనిమిదేళ్లలో తెలంగాణలో కేవలం 100 కి.మీ. పొడవైన రైల్వే ట్రాక్ మాత్రమే వేశారని గుర్తుచేశారు.
నలుగురు బీజేపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లి చేయాల్సిన పనులు చేయాలని సూచించారు. మోదీ అధికారంలోకి వచ్చాక లింగంపల్లి- విజయవాడకు ఒక కొత్త రైలు ఇచ్చారన్నారు. మళ్లీ రైల్వేలైన్, రైళ్లు, పథకాలు ఏవీ కేటాయించలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు సాధారణంగా ఎంపీలను పిలిచి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు అడిగే సంప్రదాయం ఉండేదన్నారు. ‘తెలంగాణ ఎంపీలు సంజయ్, అర్వింద్, బాపూరావు, కిషన్‌రెడ్డిని అడిగితే దండగ అనుకున్నారేమో? అందుకే పిలవలేదు’ అని ఎద్దేవా చేశారు. రైల్వేలో సీనియర్ సిటిజన్ రాయితీలు కూడా ఎత్తి వేశారని.. పెద్దమనుషులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని డిమండ్ చేశారు. మోదీ కూడా సీనియర్ సిటిజనే అని, ఆయనకూ ఉపయోగడపడుతుందని అన్నారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని పేర్కొంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేటీఆర్ సోమవారం లేఖ రాశారు. తెలంగాణకు రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలను లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు ప్రకటించకుండా కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. కనీసం ఈసారి బడ్జెట్‌లోనైనా తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఐటీసీ స్థానిక ఆలు, గోధుమలు కొనాలి
మెదక్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్వల్పకాలంలోనే అనూహ్య ప్రగతిని సాధించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతులకు 24 గంటల పాటు విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణే అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో సోమవారం ఐటీసీ సంస్థ రూ.450 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో దేశంలోనే అతిపెద్ద పేపర్ మిల్లును భద్రాచలంలో ఐటీసీ నడిపిస్తోందని కేటీఆర్ తెలిపారు. మనోహరాబాద్ యూనిట్‌లో ఆశీర్వాద్ ఆటా, నూడుల్స్, చిప్స్, బింగో, సన్‌ఫీ్‌స్ట బిస్కట్ల వంటి ఉత్పత్తులు తయారవుతాయని తెలిపారు. ఈ ప్రాంతంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి సహకరించాలని ఐటీసీ చైర్మన్ సంజయ్ పురీని కేటీఆర్ కోరారు. అలాగే భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కంపెనీ తయారు చేసే చిప్స్, బిస్కట్ల కోసం ఆలు, గోధుమ పంటలను మనోహరాబాద్ మండల రైతుల దగ్గర కొనుగోలు చేయాలని సూచించారు. రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ చెప్పారు. ఐటీసీ యాజమాన్యానికి ఆసక్తి ఉంటే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని స్థాపించాలని మంత్రి కోరారు.
అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి
బేగంపేట, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): యువత పరిశ్రమలు స్థాపించి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బేగంపేటలోని క్యూన్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కోడ్ ఆక్యూటీ కంపెనీని మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోడ్ ఆక్యూటీ కంపెనీ మన దేశంతోపాటు అమెరికాలో పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ కంపెనీ కృత్రిమ మేధ, మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ తదితర అంశాలపై దృష్టి పెడుతుందని తెలిపారు. ఐటీ రంగంలో ముందుకెళ్లే యువతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు.