‘డబుల్’ ఇళ్ల కథేమిటో!?
ABN , First Publish Date - 2023-12-13T00:10:45+05:30 IST
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి, పంపిణీ కానీ ఇళ్లను కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తుందా?
బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ఫలించని పథకం
సగం కూడా కట్టలేదు.. కట్టిన వాటిని పంచలేదు..
కాంగ్రెస్ సర్కారు నిర్మిస్తుందా? పంపిణీ చేస్తుందా?
ఇందిరమ్మ ఇళ్ల పథకంతో బుట్టదాఖలేనా?
ఆసక్తిగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి, పంపిణీ కానీ ఇళ్లను కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తుందా? పూర్తికాక సగంలో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసి అప్పగిస్తుందా? అసలే పనులు మొదలు కాని ఇళ్ల సంగతేమిటి? వాటిని రద్దు చేస్తుందా? ప్రజలను ప్రస్తుతం తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్లు అనే పథకం ప్రవేశపెట్టగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో స్పష్టత ఎలా ఉండనుందో చూడాలి.
హనుమకొండ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. పంపి ణీ కోసం ఎదురుచూస్తున్నవారు మరింత ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వం రెండు పడకల ఇళ్ల విషయంలో ఎలాంటి విధాన నిర్ణయం తీసుకుంటోందనని ఇళ్లులేని నిరుపేదలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దృష్టి సారించలేదు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగానీ, సంబంధిత శాఖ మంత్రిగానీ ఇంకా సమీక్ష చేయలేదు. వీటి సంగతేమిటన్నదానిపై ప్రస్తు తం విస్తృతంగా చర్చ జరుగుతోంది.
కొత్త రాష్ట్రంలో..
కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఒకటి. తెలంగాణ ఇచ్చిన తర్వాత పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమంపై తరుచూ ప్రకటనలు చేసిన కేసీఆర్.. అంతకుముందు వరకూ ఇచ్చిన ఇళ్ల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. చుట్టం వస్తే బయట పడుకోవాలా? అంటే ఎద్దేవా చేశారు. వాటికి పరిష్కారంగా తాము డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లంటే ఒక గదిలో ఉండేలా కాకుండా రెండు బెడ్ రూమ్‌లు, రెండు బాత్‌రూమ్‌లు ఉండేలా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. సాధారణంగా ప్ర భుత్వాలు ఇచ్చే ఇళ్లు 260 చదరపు అడుగుల్లో ఉం టాయి.. కానీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రం 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని కేసీఆర్ చెప్పారు.
ఇండిపెండెంట్ ఇళ్లకు అయితే ప్లాట్ 125 చదరపు గజాలు ఉంటుందని, ఒక వేళ అపార్టుమెంటు తరహా అయితే ఒక ఫ్లాట్‌కు 36 చదరపు గజాల వాటా వచ్చేలా ఉంటుందని ప్లాన్‌గీసీ మరీ చూపించారు. ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.29 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6.05 లక్షల వ్యయంతో వీటిని నిర్మించనున్నట్టు ప్రకటించారు. దానికి డిగ్నిటీ హౌసింగ్ అని పేరు పెట్టి 2015లో ప్రారంభించారు. ఈ పథకాన్ని ముందుగా కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద మొదలు పెట్టారు. ఎర్రవల్లిలో మోడల్ కాలనీ కట్టారు. ఈ క్రమంలో ఒకే రోజు హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో ఎనిమిది చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు.
పూర్తయినా కేటాయించలేదు..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 1505 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 1200 మాత్రమే పూర్తయ్యాయి. 225 ఇళ్లు అసలు మొదలే కాలేదు. హనుమకొండ ప్రెస్‌క్లబ్ పక్క అంబేద్కర్‌నగర్‌లో జీ ప్లస్3గా చేపట్టిన 592 ఇళ్లు పూర్తయి నాలుగేళ్లయినా ఇప్పటివరకు ఎవరికీ కేటాయించలేదు. రూ.38.78కోట్ల వ్యయంతో కట్టిన ఈ ఇళ్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇదే చోట ఇది వరకు ఉన్న గుడిసెవాసులను తొలగించి మరీ కట్టారు. వారంతా కట్టిన ఇళ్లు ఎప్పుడిస్తారా.. అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఇళ్లను పంపిణీ చేయాలని అనేకసార్లు ఆందోళన చేశారు. అయినా ఫలితం లేకుండాపోయింది. కొత్త సర్కారు వచ్చిన తర్వాత కూడా వారు కొద్ది రోజుల కిందట కట్టిన ఇళ్ల ఎదుట ధర్నా చేశారు. బలవంతంగా వాటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డగించడంతో వీలుకాలేదు. కనీసం ఈ ప్రభుత్వమైన అందచేస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. లష్కర్ సింగారంలో 128 ఇళ్లు మంజూరైతే ఒక్కటీ కట్టలేదు. న్యూ శాయంపేటలో 608 ఇళ్లు నిర్మాణమైనా ఎవరికీ ఇవ్వలేదు. కాజీపేటలో 97 ఇళ్లు మంజూరైనా ఒక్కటి మొదలు కాలేదు.
ఆర్భాటం తప్ప అమలేది?
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఆర్భాటంగా మొదలు పట్టింది కానీ అమలులో మాత్రం విఫలమైంది. చాలాచోట్ల ఇళ్ల నిర్మాణం సగంలో ఆగిపోయింది. కొన్నిచోట్ల అసలు పనులు మొదలే కాలేదు. అక్కడక్కడా పూర్తయినా వాటిని ఏ ఒక్కరికీ పంపిణీ చేయలేదు. దీంతో అవి క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం.. కొన్ని చోట్ల అసలు ఇళ్లు కట్టడానికి కాంట్రాక్టర్లే ముందుకు రాకవడంతో.. మరికొన్నిచోట్ల రేట్లు సరిపోక కాంట్రాక్టర్లు మధ్యలో వదిలేయడంతో డబుల్ బెడ్ రూమ్ పథకం అమలులో అట్టర్‌ప్లాప్ అయింది. మరోవైపు భూసేకరణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. కేంద్ర నిధుల విషయంలో వివాదం ఏర్పడింది. హడ్కోతో అప్పుల గొడవ మొదలైంది. పనులు మొదలయ్యాక ఉమ్మడి మౌలిక వసతులకు కేటాయించిన డబ్బు సరిపోకపోవడం.. తదితర అంశాలు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం అటకెక్కడానికి కారణం.
సగం కూడా కట్టలేదు..
హనుమకొండ జిల్లాకు మొత్తం 4,326 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు కాగా వీటిలో 4,219 ఇళ్లకే పాలనాపరమైన మంజూరు లభించింది. ఇప్పటి వరకు 2,141 ఇళ్లను (49.49) మాత్రమే పూర్తి చేశారు. 161 ఇళ్లు మధ్యలో అగిపోయాయి. 2,024 ఇళ్లు అసలు మొదలే కాలేదంటే ఈ పథకం అమలు తీరు ఎంత దయనీయంగా ఉందో అర్థమౌతోంది. పోనీ.. పూర్తయిన ఇళ్లను అబ్ధిదారులకు అందచేశారా.. అంటే అదీ లేదు. రూ.110కోట్ల వ్యయంతో కట్టిన ఈ 2,141 ఇళ్లలో చాలావరకు పంపిణీకాక నిరుపయోగంగా మారాయి. క్రమంగా శిథిలమవుతున్నాయి. వీటిని కట్టి వదిలేయడంతో వాటి కిటికీలు, దర్వాజలు దొంగలపాలువున్నాయి.
కాంగ్రెస్ గ్యారెంటీ ‘ఇందిరమ్మ ఇల్లు’
గూడు లేని వారి గోస తీర్చడానికి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల్లో ఒకటిగా దీనిని చేర్చింది. గతంలో కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కన్నా మరింత మెరుగ్గా అమలు చేయనున్నట్టు వా గ్దానం చేసింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున సాయమందించనున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించనున్నట్టు కూడా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి రేవంత్ ప్రభుత్వం పక్కనపడేయనున్నట్టు స్పష్టమవుతోంది. అయితే ఇప్పటివరకు నిర్మాణమైనా పంపిణీ కానీ ఇళ్లను అందచేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.