ఏపీలోకి వెళ్లిన ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తాం
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:04 AM
రాష్ట్ర విభజన సమయంలో ఏపీ పరిధిలోకి వెళ్లిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేసేందుకు త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం
భద్రాద్రి జిల్లా అధికారులతో సమావేశంలో మంత్రి తుమ్మల
భద్రాచలం/బూర్గంపాడు, డిసెంబరు 17: రాష్ట్ర విభజన సమయంలో ఏపీ పరిధిలోకి వెళ్లిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేసేందుకు త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భద్రాచలం అభివృద్ధిలో ఆ ఐదు గ్రామాలు ఎంతో కీలకమని, సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో.. భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ వినీత్ తదితర అధికారులతో సమావేశమయ్యారు. భద్రాద్రి జిల్లా సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక, భద్రాద్రి పట్టణాభివృద్ధికిసీఎ్‌సఆర్ నిధులు, సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధుల మంజూరు, పోడు సమస్య తదితర అంశాలపై చర్చించారు. సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, భూసమస్యలు, అన్ని శాఖల పెండింగు పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. భద్రాచలం పట్టణాభివృద్ధికి ఏటా రూ.2.50కోట్ల సీఎ్‌సఆర్ నిధులు కేటాయిస్తామన్నారు. సమావేశం అనంతరం మంత్రి.. గోదావరి నదిపై భద్రాచలం వద్ద నిర్మిస్తున్న రెండో వారధి పనులను పరిశీలించారు. పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రాచలంలో శ్రీ సీతారామ కమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన వసతి గృహాన్ని తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.