6న అనుబంధ చార్జిషీటు దాఖలు చేస్తాం

ABN , First Publish Date - 2023-01-05T01:09:13+05:30 IST

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ నెల 6న అనుబంధ చార్జిషీటు దాఖలు చేస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ ప్రత్యేక

6న అనుబంధ చార్జిషీటు దాఖలు చేస్తాం

న్యూఢిల్లీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ నెల 6న అనుబంధ చార్జిషీటు దాఖలు చేస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలియజేసింది. ఈ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్‌ నాయర్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ బుధవారం విచారణ జరిపారు. విజయ్‌ నాయర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రెబెక్క జాన్‌ వాదనలు వినిపించారు. విజయ్‌ నాయర్‌ మనీ లాండరింగ్‌కు పాల్పడలేదని, ఈడీ తప్పుడు ఆధారాలను సృష్టిస్తోందని తెలిపారు. అంతేకాక నాయర్‌పై విచారణ కూడా పూర్తయ్యిందని, అందువల్ల బెయిల్‌ మంజూరు చెయ్యాలని కోరారు. అయితే, అన్ని ఆధారాలతో ఈ నెల 6న అనుబంధ చార్జిషీటు దాఖలు చేస్తామని, అందులో అన్ని విషయాలు పొందుపర్చుతామని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. దాంతో విజయ్‌ నాయర్‌ను మరింత విచారించాల్సి ఉంటుందని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్‌ తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేశారు.

Updated Date - 2023-01-05T01:09:14+05:30 IST