రేవంత్‌లో రాజన్నను చూస్తున్నాం
ABN , Publish Date - Dec 24 , 2023 | 04:44 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలోని పాలనా సమర్థతను చూస్తున్నామని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
విపక్షాల సూచనలను గౌరవిస్తాం:మంత్రి కొండా సురేఖ
హనుమకొండ సిటీ, డిసెంబరు 23: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలోని పాలనా సమర్థతను చూస్తున్నామని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం హనుమకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల సమస్యలు వినడంతోపాటు వాటి పరిష్కార చర్యలను వెనువెంటనే తీసుకునేవారని, సీఎం రేవంత్‌లో కూడా అవే పాలనా లక్షణాలు ఉన్నాయని అన్నారు. ప్రజావాణి ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారని, తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే విశ్వాసంతో ప్రజలు ప్రజావాణికి వినతులు సమర్పిస్తున్నారని పేర్కొన్నారు. అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ వలే ప్రతిపక్షాల గొంతు నొక్కే వైఖరి కాంగ్రె్‌సది కాదని, ప్రతిపక్షాల సలహాలు, సూచనలను సహేతుకంగా స్వీకరిస్తామని అన్నారు. ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరను విజయవంతంగా నిర్వహిస్తామని, ఆ బాధ్యతను తనకు అప్పగించడం ఆనందంగా ఉందని చెప్పారు.