142 లెటర్లు రాశాం.. స్పందించరేం?

ABN , First Publish Date - 2023-06-26T02:15:38+05:30 IST

అనుమతులు లేకుండా ఏపీ ఒకవైపు కొత్తగా పలు ప్రాజెక్టులను చేపడుతుండడంతోపాటు, మరోవైపు పాత ప్రాజెక్టుల సామర్థ్యాన్ని సైతం ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా విస్తరిస్తోందని,

142 లెటర్లు రాశాం.. స్పందించరేం?

8 కేఆర్‌ఎంబీకి మరోసారి లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): అనుమతులు లేకుండా ఏపీ ఒకవైపు కొత్తగా పలు ప్రాజెక్టులను చేపడుతుండడంతోపాటు, మరోవైపు పాత ప్రాజెక్టుల సామర్థ్యాన్ని సైతం ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా విస్తరిస్తోందని, అయినా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ సర్కారు నిలదీసింది. 142 లెటర్లు రాసినా బోర్డు ఉదాసీనంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఈ మేరకు బోర్డు చైర్మన్‌కు తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌ ఇటీవల లేఖను రాశారు. బోర్డు వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టారు. అనుమతులు లేకుండానే ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుల పనులను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఇప్పటికే 40 లేఖలు రాసిందని, అదేవిధంగా అక్రమంగా ఏపీ చేపట్టిన పలు ప్రాజెక్టుల విస్తరణను కూడా నిరోధించాలని కోరుతూ 32 లేఖలు రాసిందని గుర్తుచేశారు. అదీగాక కృష్ణా జలాల వినియోగంతోపాటు పలు అంశాలపై 70 లేఖలు రాశామని, మొత్తంగా 142 లేఖలు బోర్డుకు తెలంగాణ రాసిందని వివరించారు. ఇప్పటికైనా బోర్డు స్పందించాలని, ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల పనులను నిలిపివేసేలా చర్యలుతీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-06-26T02:15:38+05:30 IST