పిల్లనగ్రోవిని, పింఛాన్ని తీసేశాం.. చేతిలో ఖడ్గాన్ని పెట్టాం
ABN , First Publish Date - 2023-05-27T03:42:27+05:30 IST
ఖమ్మంలో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటులో ఎలాంటి రాజకీయ కోణం లేదని, న్యాయస్థానం అనుమతితో మార్పులు చేర్పులు చేసిన ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ ప్రతినిధులు, విగ్రహ ఏర్పాటు కమిటీ ప్రతినిధులు తెలిపారు.

ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్, విగ్రహ కమిటీ ప్రతినిధులు
పంజాగుట్ట, మే 26 (ఆంధ్రజ్యోతి): ఖమ్మంలో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటులో ఎలాంటి రాజకీయ కోణం లేదని, న్యాయస్థానం అనుమతితో మార్పులు చేర్పులు చేసిన ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ ప్రతినిధులు, విగ్రహ ఏర్పాటు కమిటీ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తానా మాజీ అధ్యక్షుడు జయ్ తాళ్లూరి, విగ్రహ కమిటీ కన్వీనర్ దొడ్డా రవి, విగ్రహ శిల్పి ప్రతాప్ వర్మ తదితరులు మాట్లాడారు. ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో మూడేళ్ల క్రితమే ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని తాము నిర్ణయించామని తెలిపారు. విగ్రహ ఏర్పాటుతో మంత్రి పువ్వాడ అజయ్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆయన అనుమతులు మాత్రమే ఇప్పించారని చెప్పారు. దాన వీర శూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి వేషం వేశారని, అదే రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి, విగ్రహం కింద, శిలాఫలకంపై దాన వీర శూర కర్ణ సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్ విగ్రహం అని పెడదామనుకున్నామన్నారు. అయితే విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందేనని చెప్పారు. విగ్రహం చేతిలో నుంచి పిల్లనగ్రోవిని, పింఛాన్ని, సుదర్శన చక్రాన్ని తీసివేశామని, చేతిలో ఖడ్గాన్ని పెట్టామన్నారు. కోర్టు అనుమతితో రూపురేఖలు మార్చి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని వారు తెలిపారు.