సిద్దిపేట కలెక్టర్‌ను హాజరవ్వాలని ఆదేశిస్తాం

ABN , First Publish Date - 2023-09-15T03:48:01+05:30 IST

మల్లన్నసాగర్‌ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి తప్పుడు తేదీలతో భూసేకరణ ప్రాథమిక నోటిఫికేషన్‌ పొడిగింపు గెజిట్‌ జారీచేశారంటూ దాఖలైన పిటిషన్‌లో సిద్దిపేట కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సిద్దిపేట కలెక్టర్‌ను హాజరవ్వాలని ఆదేశిస్తాం

మా దగ్గర ట్రిక్స్‌ ప్లే చేయొద్దు : హైకోర్టు

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మల్లన్నసాగర్‌ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి తప్పుడు తేదీలతో భూసేకరణ ప్రాథమిక నోటిఫికేషన్‌ పొడిగింపు గెజిట్‌ జారీచేశారంటూ దాఖలైన పిటిషన్‌లో సిద్దిపేట కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గెజిట్‌ ప్రింటింగ్‌ కోసం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ డైరెక్టర్‌కు సిద్దిపేట కలెక్టర్‌ రాసిన లేఖను సమర్పించాలని ఈనెల 5న హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తాజాగా గురువారం ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది తొలుత వారం రోజుల సమయం ఇవ్వాలని.. ఆ తర్వాత రెండు వారాల సమయం కావాలని కోరడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మా దగ్గర ట్రిక్స్‌ ప్లే చేయొద్దు. లేఖ సమర్పించాలన్న మా ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదు..? ఆ లేఖ ఎప్పుడు సమర్పించారన్న వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయండి’’ అని సిద్దిపేట కలెక్టర్‌ను ఆదేశించింది. అఫిడవిట్‌ దాఖలులో విఫలం అయితే.. సిద్దిపేట కలెక్టర్‌ను వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశిస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

Updated Date - 2023-09-15T03:48:01+05:30 IST