Share News

సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం

ABN , First Publish Date - 2023-12-11T03:49:42+05:30 IST

రాష్ట్రంలో సంపదను సృష్టించి, ప్రజలకు పంచుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

సంపద సృష్టించి  ప్రజలకు పంచుతాం

కేసీఆర్‌లాగా మాయమాటలు చెప్పబోం.. అక్రమ సొమ్మును కక్కించి, ప్రజలకు అందిస్తాం

ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మంత్రులు తుమ్మల, పొంగులేటి

ఖమ్మం జిల్లాలో ముగ్గురికీ కాంగ్రెస్‌ శ్రేణుల ఘన స్వాగతం

ఖమ్మం/కొత్తగూడెం/భద్రాచలం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంపదను సృష్టించి, ప్రజలకు పంచుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో కీలక శాఖల బాఽధ్యతలు స్వీకరించిన అనంతరం వారు ఆదివారం ఖమ్మం జిల్లాకు వచ్చారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు గజమాలతో సత్కరించి వారికి ఘనస్వాగతం పలికారు. మంత్రులు అక్కడి నుంచి ఓపెన్‌టా్‌ప వాహనంలో ర్యాలీగా ఖమ్మం చేరుకున్నారు. మార్గమధ్యలో కూసుమంచి ఆస్పత్రిలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత ఖమ్మం పాతబస్టాండ్‌లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో, విలేకరుల సమావేశాల్లో మంత్రులు మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అమల్లోకి తెచ్చామని, అలాగే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వైద్యసాయం కూడా అందిస్తున్నామని చెప్పారు.

ఇక రాష్ట్రంలో రామరాజ్యం..

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన ఘనత కాంగ్రె్‌సదేనని, మిగిలిన గ్యారెంటీలనూ దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్‌లా మాయమాటలు చెప్పబోమని, రాష్ట్రంలో సంపదను సృష్టించి, దాన్ని ప్రజలకు పంచుతామని తెలిపారు. తమ ప్రభుత్వం పేదలతోపాటు జర్నలిస్టులకు కూడా ఇళ్లస్థలాలు ఇస్తుందని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జర్నలిస్టులను మోసగించిందని ఆరోపించారు. కోర్టుల నుంచి అనుమతి వచ్చినా ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మళ్లీ మంత్రిగా పనిచేసే అదృష్టం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు కల్పించారని చెప్పారు. శ్రీరామచంద్రుడి దయతో మళ్లీ జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం దక్కిందని అన్నారు. గోదావరి జలాలను ఖమ్మం జిల్లా అంతటా పారించి సస్యశ్యామలం చేసి కాంగ్రెస్‌ ఇచ్చిన హామీతో పాటు తన మాటను కూడా నెరవేర్చి తీరతానని ప్రకటించారు. జిల్లా అధికారులు కూడా అద్భుతంగా పనిచేయాలని, గతంలో కొందరు పనికిమాలినోళ్ల ఒత్తిడి వల్ల తప్పులు చేశారని, ఆ తప్పులను సరిదిద్దుకునే బాధ్యత వారిపై ఉందని చెప్పారు. తప్పుడు కేసులు సరిచేసుకోవాలని, ఆక్రమణలు తొలిగించాలని కలెక్టర్‌, సీపీలను ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రూపాయి కూడా లేకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. గత పాలనలో జరిగిన అవినీతిని నిగ్గుతేల్చి అక్రమ సొమ్మును కక్కిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. రాత్రికి ముగ్గురు మంత్రులు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఇకపై రాష్ట్రంలో రామరాజ్యం కొనసాగుతుందని ఆయన చెప్పారు.

Updated Date - 2023-12-11T03:49:43+05:30 IST