Share News

జలవనరులే డంపింగ్‌ యార్డులు!

ABN , First Publish Date - 2023-11-20T23:43:40+05:30 IST

రెండు పర్యాయాలు క్లీన్‌ సిటీ అవార్డులు అందుకున్న మేడ్చల్‌ జిల్లా, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ కంపుకొడుతోంది. చెత్త సేకరణపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్రజలు చెత్తను జలవనరుల్లో వేసి వెళ్తున్నారు. దీంతో చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు డంపింగ్‌ యార్డులుగా మారాయి. వాటి పరిసరాలు దుర్గంధంగా మారాయి. దోమలు విజృంభిస్తున్నాయి. అంతేకాకుండా జనవనరులు కలుషితమవుతున్నాయి.

జలవనరులే డంపింగ్‌ యార్డులు!
ఘట్‌కేసర్‌లోని చెటేరుకుంటలో పేరుకుపోయిన చెత్త

ఘట్‌కేసర్‌లో ఎక్కడ చూసిన చెత్త కుప్పలే దర్శనం

చెరువులు, కుంటలు, వాగులు, కాలువల సమీపంలో చెత్త పారబోత

రెండు పర్యాయాలు క్లీన్‌ సిటీ అవార్డులు అందుకున్నా ఫలితం శూన్యం

కంపుకొడుతున్న పరిసరాలు.. విజృంభిస్తున్న దోమలు

పట్టించుకోని అధికారులు, పాలకవర్గం

చర్యలు చేపట్టాలని పలువురి డిమాండ్‌

రెండు పర్యాయాలు క్లీన్‌ సిటీ అవార్డులు అందుకున్న మేడ్చల్‌ జిల్లా, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ కంపుకొడుతోంది. చెత్త సేకరణపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్రజలు చెత్తను జలవనరుల్లో వేసి వెళ్తున్నారు. దీంతో చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు డంపింగ్‌ యార్డులుగా మారాయి. వాటి పరిసరాలు దుర్గంధంగా మారాయి. దోమలు విజృంభిస్తున్నాయి. అంతేకాకుండా జనవనరులు కలుషితమవుతున్నాయి.

ఘట్‌కేసర్‌, నవంబర్‌ 20 : చెరువులు, కుంటలు, వాగులు, కాలువలే డంపింగ్‌ యార్డులుగా మారాయి. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని జలవనరులు డంపింగ్‌ కేంద్రాలుగా మారి దుర్గంధ వెదజల్లుతున్నాయి. రెండుపర్యాయాలు క్లీన్‌సిటీ ఆవార్డు పొందిన ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ప్రధానంగా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని చెటేరుకుంట, రాయికుంట, చిన్నచెరువు, ఎరిమల్లెవాగు పరిసరాలు ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇంత జరుగుతునా మున్సిపల్‌ అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ కనీస చర్యలు చేపట్టకపోవడంలో అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలైన పోలీసుస్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల పక్కనే గల చెటేరుకుంటతో పాటు ఎరిమల్లె వాగు పరిసరాలు మొత్తం చెత్త్తచెదారంతో నిండి పోయాయి. మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణపై అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రజలు చెత్తను జలవనరుల్లో వేసి వెళ్తున్నారు. మున్సిపాలిటీలో చెత్తసేకరణను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారు. ఇందుకుగాను నెలకు రూ.50 వసులు చేస్తారు. దీంతో వారు మూడునాలుగు రోజులకోసారి ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి తీసుకెళ్తున్నారు. ఇకొందరు వ్యక్తులు రూ. 50 చెల్లించడానికి ఇష్టపడక చెత్తను రోడ్లపక్కన చెరువులు, కుంటలు, వాగుల్లో, కాలువల్లో పడేసి వెళ్తున్నారు. దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా మున్సిపాలిటీలలో చెత్త సమస్య నెలకొన్నప్పటికీ అధికారులు కనీస చర్యలు చేపట్టక పోవడంతో రోజురోజుకూ పరిసరాలు కలుషితమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పెరిగిపోయి పర్యవరణ సమస్యలు తలెత్తనున్నాయిన పర్యవరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదముందని సూచిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు. ప్రజాప్రతినిధులు స్పందించి చెత్తను బయటవేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతే కాకుండా జలవనరుల పరిసరాల్లో చేత్త వేయకుండా చూడాలని, పర్యావరణ పరిరక్షణ కు కృషి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జలవనరులను కాపాడాలి

చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అఽధికారులు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఘట్‌కేసర్‌లో చెటేరుకుంట, ఎరిమల్లెవాగు మొత్తం చెత్తతో నిండిపోతున్నది. అధికారులు స్పందించి జలవనరుల రక్షణకు చర్యలు తీసుకోవాలి.

- కొమ్మిడి సాంబశివారెడ్డి, న్యాయవాది, ఘట్‌కేసర్‌

అధికారులు చర్యలు చేపట్టాలి

చెత్తను, ప్రధానంగా ప్లాస్టిక్‌ కవర్లను ఎక్కడ పడితే అక్కడ పడవేయడంతో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. అఽధికారులు కఠిన చర్యలు చేపట్టాలి. చెరువులు, రోడ్లపక్కన ప్లాస్టిక్‌ కవర్లతో పాటు చెత్తను వేయడంతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. మున్సిపాలిటీ వాహనాల్లో చెత్తవేయండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలి.

- కందకట్ల రామాకృష్ణారెడ్డి ఘట్‌కేసర్‌

Updated Date - 2023-11-20T23:43:41+05:30 IST