వరంగల్‌ వెటర్నరీ కాలేజీ మూసివేత!

ABN , First Publish Date - 2023-06-01T03:41:08+05:30 IST

బోధన, బోధనేతర సిబ్బందిని నియమించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం ఓ వెటర్నరీ కాలేజీ మూతపడేందుకు కారణమైంది.

వరంగల్‌ వెటర్నరీ కాలేజీ మూసివేత!

2023-24 సంవత్సరానికి ఎంసెట్‌ అడ్మిషన్లు నిలిపివేసిన వీసీఐ

8సిబ్బందిని నియమించని రాష్ట్ర ప్రభుత్వం

వెటర్నరీ కౌన్సిల్‌ తనిఖీ నివేదిక ఆధారంగా వీసీఐ కీలక నిర్ణయం

ఇతర కళాశాలలకు సీనియర్‌ విద్యార్థులు!

విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన

హైదరాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి): బోధన, బోధనేతర సిబ్బందిని నియమించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం ఓ వెటర్నరీ కాలేజీ మూతపడేందుకు కారణమైంది. వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (వీసీఐ) తీసుకున్న నిర్ణయంతో వరంగల్‌ జిల్లా మామునూరు వెటర్నరీ కళాశాలలో అడ్మిషన్లకు బ్రేక్‌ పడింది. 2023-24 సంవత్సరం ఎంసెంట్‌ కౌన్సెలింగ్‌కు అడ్మిషన్లు తీసుకోలేకపోవడం ఒకెత్తయితే ఇప్పటికే ఉన్న బీవీఎస్సీ విద్యార్థులను ఇతర కళాశాలలకు తరలించాలనడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలో హైదరాబాద్‌ (రాజేంద్రనగర్‌), వరంగల్‌ (మామునూరు), జగిత్యాల (కోరుట్ల)లో కాలేజీలు ఉన్నాయి. మామునూరులో 2016-17లో రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో వీసీఐ కళాశాలను స్థాపించింది. పర్మిషన్‌ లెటర్‌ రెన్యువల్‌, తుది గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో జనవరి 16, 17 తేదీల్లో ఢిల్లీ నుంచి వచ్చిన వెటర్నరీ కౌన్సిల్‌ బృందం తనిఖీ చేసింది.

17 మంది ప్రొఫెసర్లకు 8 మంది, 16 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ఐదుగురు, 41 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు 33 మంది మాత్రమే ఉన్నారని మార్చి 2న వెటర్నరీ కౌన్సిల్‌కు నివేదిక సమర్పించింది. 6 విభాగాలకు ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు లేరు. వీసీఐ నిబంధనల ప్రకారం.. కోళ్లు (పౌలీ్ట్ర బర్డ్స్‌), ఆవులు, గేదెలు (లైవ్‌ స్టాక్‌) లేవు. పశువులు తరలించడానికి రవాణా సౌకర్యం లేదు. మూడు, నాలుగో సంవత్సరం వారికి కూడా ఎలాంటి మౌలిక వసతులు లేవు. యాంటీ ర్యాగింగ్‌ సెల్‌, గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయలేదని వీసీఐ బృందం పరిశీలనలో తేలింది. తర్వాత ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో దీనిపై తీవ్ర చర్చ జరిగింది. 3, 4వ సంవత్సరాలకు రెన్యువల్‌ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు కూడా పంపకూడదని సూచించింది. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సూచించిన మేరకు వసతులు సమకూరుస్తామంటే 6 నెలలు కాల పరిమితితో, వెటర్నరీ కౌన్సిల్‌ అధికారుల బృందం తనిఖీ తర్వాతే పరిశీలించాలని వీసీఐ చీఫ్‌ వినోద్‌ భట్‌ సూచించారు. అప్పటివరకు మొదటి సంవత్సరం అడ్మిషన్లు నిలిపివేయాలని, మామునూరు కళాశాలను బంద్‌ చేయాలని, సీనియర్‌ విద్యార్థులను ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇతర కళాశాలలకు బదిలీ చేయాలని ఉత్తర్వులిచ్చారు.

ప్రభుత్వ వైఫల్యం.. విద్యార్థులకు అన్యాయం

వెటర్నరీ కళాశాలను అట్టహాసంగా స్థాపించిన కేసీఆర్‌ ప్రభుత్వం వసతుల కల్పన, బోధన, బోధనేతర సిబ్బంది నియామకంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నాలుగేళ్లు నడిచిన కళాశాల మూతపడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. మామునూరు కళాశాలలో 40 మంది విద్యార్థులున్నారు. వీరిలో 20 మందిని రాజేంద్రనగర్‌, 20 మందిని కోరుట్ల తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మామునూరు వెటర్నరీ కళాశాల విద్యార్థులు పెట్టేబేడా సర్దుకుని వెళ్తున్నారు. వాస్తవానికి మూడు కళాశాలల్లోనూ బీవీఎస్సీ, ఎంవీఎస్సీ విద్యార్థులకు అన్ని వసతులు సమకూర్చినట్లు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం నివేదిక సమర్పించింది. కానీ మిగిలిన రెండు కళాశాలలు కూడా అరకొర వసతులు, సిబ్బందితోనే నడుస్తున్నాయి. మామునూరు విద్యార్థులు వెళ్తే మరిన్ని ఇబ్బందులు తప్పవు.

నియామకాలు ఎందుకు చేపట్టడం లేదు?

పశువైద్య కళాశాలల నిర్వహణ బాధ్యత మొత్తం యూనివర్సిటీ పరిధిలోనే ఉంటుంది. ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలు నాలుగైదేళ్లుగా చేపట్టడం లేదు. వేతనాల చెల్లింపులు, వసతుల కల్పన భారంగా మారుతుందనే దీని వెనుక ఉన్న ఉద్దేశం. అసలు ఇంతవరకు పశు వైద్య విశ్వవిద్యాలయంపై ప్రభుత్వ పెద్దలు ఎలాంటి సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు. యూనివర్సిటీ కీలక పోస్టులో ఓ మంత్రి వియ్యంకుడు తిష్టవేసి ఉన్నారు. ప్రభుత్వ అనుమతితో పోస్టులు భర్తీ సహా అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. తూతూమంత్రంగా వర్సిటీని నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2023-06-01T03:41:08+05:30 IST