Share News

మల్కాపురం చెరువులో యుద్ధవాహనం ట్రయల్‌

ABN , Publish Date - Dec 22 , 2023 | 04:24 AM

నేలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతోనూ.. నీటిపై గంటకు 7 కిలోమీటర్ల వేగంతోనూ.. ప్రయాణించే సామర్థ్యంగల ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్‌ వెహికల్‌ బీఎంపీ-2 ఇది.

మల్కాపురం చెరువులో యుద్ధవాహనం ట్రయల్‌

కంది, అల్వాల్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నేలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతోనూ.. నీటిపై గంటకు 7 కిలోమీటర్ల వేగంతోనూ.. ప్రయాణించే సామర్థ్యంగల ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్‌ వెహికల్‌ బీఎంపీ-2 ఇది. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎద్దుమైలారం వద్దనున్న ఆర్మ్‌డ్‌ వెహికల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో తయారైన రెండు యుద్ధవాహనాలను గురువారం ఉదయం కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ చెరువులో పరీక్షించారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ క్వాలిటీ ఎష్యూరెన్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ఫ్లోటేషన్‌ ట్రయల్‌ రన్‌లో భాగంగా ఈ యుద్ధవాహనాలను నేలపై, నీటిపై, గుంతల్లో నడిపి చూశారు. మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ అధికారులు ఈ వాహనంపై ఎక్కి మల్కాపూర్‌ పెద్ద చెరువులో ప్రయాణం చేశారు. దాదాపు 14 టన్నుల బరువుండే ఈ వాహనాలు నైట్‌ విజన్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిలో 30ఎంఎం ప్రధాన తుపాకీ, 762 రైఫిల్‌తోపాటు మిసైల్‌ లాంచర్‌ ఉంటాయి. యుద్ధ సమయంలో సైనికులను ఒకచోటు నుంచి మరొకచోటుకు తరలించడానికి ఉపయోగపడతాయి. అత్యాధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలను కలిగి ఉండే ఈ వాహనాలు శత్రువాహనాలను పసిగట్టి ఫైరింగ్‌ చేస్తాయని మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ రత్నప్రసాద్‌ తెలిపారు. కాగా.. ఇప్పటివరకూ ఇలాంటి రెండువేల వాహనాలను మన సైనికులకు ఇక్కడి నుంచి పంపించినట్టు ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కె.సుధాకర్‌ వెల్లడించారు.

Updated Date - Dec 22 , 2023 | 04:25 AM