రాజకీయ వేదికగా ‘వజ్రోత్సవ’ ముగింపు!

ABN , First Publish Date - 2023-09-01T03:07:50+05:30 IST

మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు అధికార బీఆర్‌ఎస్‌

రాజకీయ వేదికగా ‘వజ్రోత్సవ’ ముగింపు!

సభకు వేలాది మంది ప్రజాప్రతినిధులు

ఎన్నికలప్పుడే గుర్తుకొస్తామంటూ పలువురి ఫైర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు అధికార బీఆర్‌ఎస్‌ శతవిధాలా ప్రయత్నిస్తోంది. రెండు నెల ల కిందట నిర్వహించిన తెలంగాణ దశాబ్ది వేడుకలను ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించినా.. దాన్ని పూర్తిగా పార్టీ కార్యక్రమంగా మార్చుకున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఇదిలాఉండగా.. శుక్రవారం (నేడు) హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సైతం తమకు అనుకూలంగా మలచుకునేందుకు బీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఖర్చుతో చేపట్టే కార్యక్రమం అయినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా అందరూ ప్రజాప్రతినిధులను ఒక్కచోటకు చేర్చేలా ఈకార్యక్రమానికి రూపకల్పన చేశారు. సీఎంతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లు, మునిసిపల్‌ చైర్‌పర్సన్లు, జిల్లాపరిషత్‌ చైర్మన్లు, జెడ్పీటీసీలు, మండల పరిషత్‌ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతుబం ధు సమితిల అధ్యక్షులు, ఆలిండియా సర్వీస్‌ అధికారులు. పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల పేరిట వేలాది మంది ప్రజాప్రతినిధులను ఒక్కచోటకు చేర్చి.. అధికార బీఆర్‌ఎస్‌ రాజకీయ వేదికగా మార్చుకుంటోందని ఆయా వర్గాలు విమర్శిస్తున్నాయి.

మాగోడు పట్టించుకోండి..

వజ్రోత్సవ వేడుకలకు స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడం సంతోషమే అయునా.. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదని పలువురు సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సమయంలోనే తామంతా గుర్తుకొస్తామని.. నిధుల్లేక నిర్వీర్యమవుతున్న స్థానిక సంస్థల గోడు ఇప్పటికైనా పట్టించుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు సర్కారు ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధుల బకాయిలను సత్వరమే చెల్లించాలని పలువురు సర్పంచులు కోరుతున్నారు.

Updated Date - 2023-09-01T03:07:50+05:30 IST