BJP :కమలంలో కలత
ABN , First Publish Date - 2023-09-22T02:55:01+05:30 IST
జాతీయ నాయకత్వం వైఖరిపై సీనియర్ల తీవ్ర అసంతృప్తి.. కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలోకి వరుసగా వలసలు..
రాష్ట్ర బీజేపీని తలో దిక్కుకు లాగుతున్న వైనం
జాతీయ నాయకత్వంపై సీనియర్ల అసంతృప్తి!
సస్పెన్షన్ల లొల్లి.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లోకి వలస
నాపై పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారు
లీకులకు నేను వ్యతిరేకిని.. విజయశాంతి ట్వీట్
రాజకీయాల్లో హత్యలుండవ్: ఈటల వ్యాఖ్య
కాంగ్రెస్‌లోకి దేవేందర్‌గౌడ్ కొడుకు వీరేందర్!
హైదరాబాద్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జాతీయ నాయకత్వం వైఖరిపై సీనియర్ల తీవ్ర అసంతృప్తి.. కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలోకి వరుసగా వలసలు.. ఇతర పార్టీల నుంచి చేరికలపై ప్రహసనం.. బలం ఉన్న నాయకుల సస్పెన్షన్.. నేతలపై సొంత పార్టీ వారే దుష్ప్రచారం.. ముఖ్య నాయకుల్లోనే నిర్వేదం..! ఇదీ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి. తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమంటూ జాతీయ, రాష్ట్ర నాయకులు కుండబద్దలు కొడుతున్నా, కొద్ది రోజులుగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం కేడర్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీనియర్ నేతల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతం అవుతుండడంతో.. ఇది ఎక్కడకు దారితీస్తుందోనని వారిలో బెంగ పట్టుకుంది. ఎన్నికల ముంగిట.. లోపాలను సరిచేసుకుంటూ ఏ పార్టీ అయినా సాధ్యమైనంత బలపడాలని చూస్తుంది. కానీ, రాష్ట్ర బీజేపీలో దీనికి భిన్నంగా ఉంది. చేరికల ప్రక్రియ ప్రహసనంగా మారిందని పార్టీ నేతలు పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నవారిని కొందరు సీనియర్లు అడ్డుకుంటున్నారని పేర్కొంటున్నారు. ‘‘ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కీలక నియోజకవర్గాల నుంచి పట్టున్న నాయకులను చేర్చుకునే ప్రయత్నాలు చురుగ్గా జరిగాయి. అయితే, ఒకరిద్దరు సీనియర్లు మోకాలడ్డడంతో వారు మరో పార్టీలోకి వెళ్లిపోయారు’’ అని ఇటీవలి ఘటనలను ఉదహరించారు.
కాగా, మాజీ మంత్రి కృష్ణాయాదవ్, చీకోటి ప్రవీణ్ ఉదంతాలతో పార్టీ ఇమేజ్ మరింత దిగజారిందని ఓ సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు. ‘‘వారిని ఆహ్వానించింది ఎవరు? పార్టీ కార్యాలయానికి అట్టహాసంగా వస్తే చివరి నిమిషంలో ముఖ్య నేతలు ఎందుకు ముఖం చాటేశారు? అసలు ఎందుకు ఇంత గందరగోళం?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడిగానూ పనిచేసిన యెన్నెం శ్రీనివాసరెడ్డి సస్పెన్షన్ వ్యవహారం కూడా పార్టీ కేడర్‌లో చర్చనీయాంశమైంది. వేటు అనంతరం వీరు బీజేపీ నాయకత్వంపై విమర్శలు చేశారు. వాటిని నాయకత్వం తిప్పికొట్టలేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సినీ నటి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి.. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు మాత్రం మరింత చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాను అభిమానిస్తానంటూ రెండు రోజుల కిందట విజయశాంతి చేసిన ట్వీట్ పార్టీలో వివాదాస్పదమైంది. వెంటనే ఆమె దానిని తొలగించారు. అయితే, గురువారం చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘‘చిట్‌చాట్ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ నాకు అలవాటు లేదు. పార్టీకి ఏది ముఖ్యమో ఆ అంశాలను 16న ప్రధాన నేతలకు స్పష్టం చెప్పా. ఆ విషయాలను లీకేజీల పేరిట బయటకు చెప్పడానికి నేను వ్యతిరేకిని. ఇదంతా తెలిసి కూడా మా పార్టీ నేతలు కొందరు.. బీజేపీకి రాములమ్మ దూరం అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఇది ఖండించదగినది’’ అంటూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. దీంతో వ్యూహాలు వెల్లడించే నాయకులు ఎవరు? విజయశాంతి కాంగ్రె్‌సలోకి వెళ్తారని ప్రచారం చేస్తున్నది ఎవరు? అంటూ పార్టీ వర్గాలు చర్చించుకున్నాయి.
అసంతృప్తి భేటీపై నాయకత్వం ఆరా
తమ తీరును తప్పుబడుతూ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వైఖరిని విమర్శిస్తూ ఇటీవల కొందరు సీనియర్లు నిర్వహించిన రహస్య భేటీపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. సమావేశంలో అసలు వారు ఏం మాట్లాడుకున్నారు? అంటూ మీడియా కథనాల ఆధారంగా ప్రత్యేకంగా నివేదిక తీసుకుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఈ కమ్రంలోనే తనకు వ్యతిరేకంగా జరిగిన సమావేశంపై ఈటల స్పందించారు. ‘‘రాజకీయాల్లో హత్యలుండవ్.. ఆత్మహత్యలే ఉంటాయి’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘నేను ప్రజలను నమ్ముకున్న వ్యక్తిని. నాకు శత్రువులు ఎవరూ లేరు’’ అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వీరేందర్
ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడం పక్కనబెడితే ఉన్నవారిని బీజేపీ కాపాడుకోలేకపోతోందనే వాదనకు బలం చేకూరుస్తూ ఎన్నికల వేళ ఆ పార్టీకి మరో షాక్ తగలనుంది. అధికార ప్రతినిధి, మాజీ హోం మంత్రి దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ బీజేపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నేత మధుయాష్కీతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకే వీరేందర్ వెళ్లారని సన్నిహితులు చెబుతున్నారు. స్వగ్రామం తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయగర్జన సభకు వచ్చిన స్పందనను చూసి.. వీరేందర్ బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆయనకు మహేశ్వరం లేదా మల్కాజిగిరి లోక్‌సభ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించినట్లు సమాచారం.