ఎక్సైజ్‌శాఖలో అనిశ్చితి!
ABN , Publish Date - Dec 30 , 2023 | 03:25 AM
రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఇటీవల ఆటుపోట్లకు గురవుతోంది. గత ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు శాఖాధిపతులు బదిలీ అయ్యారు.
ఆరు నెలల్లో ముగ్గురు శాఖాధిపతుల బదిలీ
అవగాహన పెంచుకునే లోపే స్థానచలనం
తాజాగా మరో ఐఏఎస్ అధికారికి బాధ్యతలు
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఇటీవల ఆటుపోట్లకు గురవుతోంది. గత ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు శాఖాధిపతులు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారులకు శాఖపై అవగాహన వచ్చే లోపే బదిలీ అవుతున్నారని, పర్యవసానంగా ఎక్సైజ్ శాఖ గాడి తప్పుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త లైసెన్సు విధానం అమల్లోకి వచ్చినా.. ఇప్పటివరకు చాలా వైన్ షాపులకు లైసెన్సులు జారీ కాలేదు. ఉన్నతాధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే క్షేత్రస్థాయిలో పని చేసే స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు లైసెన్సులను జారీ చేయడం లేదని కొత్త వైన్ షాపుల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్సైజ్ డైరెక్టర్‌గా సర్ఫ్‌రాజ్ అహ్మద్ ఉండేవారు. జూన్ 28న కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయనను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో జాయింట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా నియమించింది. జూలై రెండో వారంలో ముషారఫ్ అలీ ఫరూఖీ ఎక్సైజ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ఐఏఎ్‌సలను బదిలీ చేయాలంటూ ఈసీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు ముషారఫ్ అలీని అక్టోబర్ 13న బదిలీ చేసి, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధ ప్రకా్‌షను ఎక్సైజ్ కమిషనర్‌గా నియమించారు. జ్యోతి బుద్ధ ప్రకాష్ సరిగ్గా రెండున్నర నెలలు పని చేశారు. ఇంతలో ఆయనను కూడా కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం బదిలీ చేసింది. ఆదివారం జ్యోతి బుద్ధ ప్రకా్‌షను రవాణా శాఖ కమిషనర్‌గా బదిలీ చేసి, ఎక్సైజ్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ఇ.శ్రీధర్‌ను నియమించింది. ఇంత తక్కువ సమయంలో నలుగురు అధికారులు మారడంతో ఎక్సైజ్ కమిషనరేట్ నుంచి పర్యవేక్షణ కొరవడుతోందన్న అభిప్రాయాలున్నాయి.